విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలతోపాటు రాజ్ భవన్ కు వెళ్లిన చంద్రబాబు…గవర్నర్ తో భేటీ అయ్యారు. ఆ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు చంద్రబాబు రిక్వెస్ట్ చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు…జగన్ పై నిప్పులు చెరిగారు. రాత్రి తన తండ్రి వైఎస్ఆర్ ఆత్మతో మాట్లాడి ఆ యూనివర్శిటీ పేరును జగన్ మార్చారా? అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ కంటే వైఎస్సార్ ఎలా గొప్ప వ్యక్తి అని ఆయన ప్రశ్నించారు. వైఎస్, జగన్ లు కలిసి ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 1986లో హెల్త్ యూనివర్శిటీని ఎన్టీఆర్ స్థాపించారని, దాని వెనుక ఆయన ఎంతో శ్రమించారని కొనియాడారు.
తాను సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకో మెడికల్ కాలేజీ తెచ్చిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. జగన్ మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలేనని చంద్రబాబు మండిపడ్డారు. హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తూ జగన్ రాత్రికి రాత్రి చీకటి జీవోను తీసుకు వచ్చారని చంద్రబాుబ దుయ్యబట్టారు. జగన్ వచ్చిన తర్వాతే ఏపీలో ఆరోగ్య రంగం భ్రష్టు పట్టిందని మండిపడ్డారు. జగన్ సీఎం అయిన తర్వాత మూడు మెడికల్ కాలేజీలకు మాత్రమే గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు.
కానీ, జగన్ మాత్రం తన హయాంలో రాష్ట్రానికి 16 మెడికల్ కాలేజీలు వచ్చాయని డబ్బా కొట్టుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఒకవేళ జగన్ లాగా తాను పేరు మార్చాలనుకుంటే వైఎస్సార్ కడప జిల్లా పేరు ఎప్పుడో మార్చి ఉండేవారమని చెప్పుకొచ్చారు. ఇటువంటి దిగజారుడు రాజకీయలను మానుకోవాలని జగన్ కు చంద్రబాబు హితవు పలికారు.