కృష్ణా జిల్లాలోని కొడాలి నాని స్వగ్రామం యలమర్రు పంచాయతీ సర్పంచ్ గా టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి కొల్లూరి అనూష గెలవడం, అక్కడి 12 వార్డుల్లో 11 టీడీపీ కైవసం చేసుకోవడంతో నానికి షాక్ తగిలింది. అంతేకాకుండా, కొడాలి నాని సొంత నియోజకవర్గంలోని 58 పంచాయతీలలో 20 టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే కొడాలి నానిపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. బూతుల మంత్రి సొంతూరులోనూ టీడీపీ గెలిచిందని, టీడీపీ నేతలపై అధికారులతో అక్రమ కేసులు పెట్టించినా అంతిమ విజయం న్యాయానిదేనని చంద్రబాబు అన్నారు.
వైసీపీ ప్రభుత్వ పతనానికి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే నాంది అని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూని చేసిందని, దానిని కాపాడుకునేందుకు ప్రజలు పోరాడారని కొనియాడారు. బలవంతపు ఏకగ్రీవాలతో లబ్ధిపొందాలని చూశారని, కానీ, ప్రజలు మంత్రుల స్వగ్రామాల్లో వైసీపీని ఓడించారని విమర్శించారు.
మంత్రి గౌతంరెడ్డి సొంతూరులో వైసీపీ ఓడిందని, ఏజెంట్లను బయటికి పంపి అక్రమాలకు పాల్పడ్డా టీడీపీ గెలుపును అడ్డుకోలేకపోయారని దుయ్యబట్టారు.
మరోవైపు,ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. ప.గో జిల్లా ఎస్.ముప్పవరంలో రీకౌంటింగ్ జరిపించాలని, గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం కుంకులగుంటలో పోలీసుల తీరుపై ఆక్షేపణ ఉందని లేఖ రాశారు.
నకరికల్లు ఎస్సై ఉదయ్‌బాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని
,పోలింగ్ కేంద్రాల్లో తమ వర్గం అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా తుమ్మచర్ల, పాతపాలెం, కృష్ణా జిల్లా పులుగొండ, ప్రకాశం జిల్లా అయ్యప్పరాజు పంచాయతీల ఫలితాలు విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు.