సీఎం జగన్ పై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు…జగన్ పై నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై జగన్ ఎందుకు పోరాడడం లేదో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. హోదా తీసుకురాలేకపోతే రాజీనామా చేస్తానని జగన్ , హోదా వస్తే ఒంగోలు కూడా హైదరాబాద్ లా మారుతుందని జగన్ చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.
విభజన హామీల అమలు, ప్రత్యేక రైల్వే జోన్ పై జగన్ నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధమని, వైసీపీ ఎంపీలు రెడీనా? అని చంద్రబాబు సవాల్ విసిరారు. హోదాపై ఇంకెన్నాళ్లు ప్రజల్ని మోసగిస్తారని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి జగన్ కు ముందే తెలుసని, చంద్రబాబు ఆరోపించారు. జగన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ప్రజలే ప్రభుత్వంపై తిరగబడడం ఖాయమన్నారు.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ ను వీక్షించానని చంద్రబాబు తెలిపారు. ‘అఖండ’ చిత్రం ఏపీలో పరిస్థితులకు అద్దం పడుతోందని అన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను అద్భుతంగా తెరకెక్కించారని, సినిమా చాలా బాగుందని కితాబిచ్చారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇదని అన్నారు.