ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏపీ సర్కార్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రజలకు రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించడానికి విష్ణుమూర్తి వైకుంఠం నుంచి భూమికి దిగొచ్చి మురాసురుడిని చంపాడని చంద్రబాబు ట్వీట్ చేశారు.. అలాంటిది తిరుమల వెంకటేశునితోనే పెట్టుకుంటున్న వారి సంగతి ఏంటో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు ట్వీట్ చేశారు. భక్తి ప్రపత్తులతో వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటున్న వారందరికీ చంద్రబాబు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో క్రిస్ మస్ జరుపుకుంటున్న క్రైస్తవ సోదరులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో స్థిరపడిపోయిన అజ్ఞానాన్ని, స్వార్థాన్ని, మాలిన్యాన్ని ప్రక్షాళన చేసి సమాజాన్ని సంస్కరించేందుకు వచ్చినవారే యుగకర్తలు అని చంద్రబాబు ట్వీట్ చేశారు. మానవాళికి శాంతి, ప్రేమలతో కూడిన జీవన మార్గాన్ని ఉపదేశించిన క్రీస్తు నిజమైన సంస్కరణవాది అని చంద్రబాబు చెప్పారు.
ఎమ్మెల్సీ, టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేశ్ కూడా ప్రజలకు వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీ ఇంటిల్లిపాదికీ ఆ మహావిష్ణువు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని, సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో మీ ఇల్లు కళకళలాడాలని మనసారా కోరుకుంటున్నాను’ అని లోకేశ్ ట్వీట్ చేశారు. ‘ఒక సామాన్యుడిగానే సాటి మనిషికి సేవచేసి, కష్టాల్లో అక్కున చేర్చుకుని.. సమాజసేవకు ఎలాంటి అధికారాలు అవసరం లేదని నిరూపించిన మానవతామూర్తి క్రీస్తు. సహనం, క్షమాగుణాలు ఎంత గొప్పవో చెప్పేందుకు తన రక్తం చిందించిన క్రీస్తు జన్మదినం పవిత్రం. క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
మరోవైపు, సూపర్‌స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురవడంపై చంద్రబాబు స్పందించారు. రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాని చంద్రబాబు ట్వీట్ చేశారు. శుక్రవారం ఉదయం హైబీపీతో బాధపడుతున్న రజనీకాంత్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన చెందొద్దని, రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.