టీడీపీ అదినేత చంద్రబాబు.. వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు బహిరంగ సవాల్ విసిరారు. బీసీల కోసం ఎంతో చేశానని చెబుతున్న జగన్.. ఎంతో చేస్తానని చెబుతున్న జగన్.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల ఎమ్మెల్యే టికెట్‌ను బీసీలకు కేటాయింగలరా? అక్కడ బీసీని నిలబెట్టి గెలిపించగలరా? అని సవాల్ రువ్వారు. బీసీని గెలిపించాలంటే జగన్ కేటాయించాల్సిన మొదటి సీటు పులివెందులదేనని పేర్కొన్నారు. ఎంత మందిని మార్చినా వైసీపీని ఓడించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని అన్నారు.
పొత్తులు అందుకే తమ్ముళ్లూ..
టీడీపీ, జనసేన పొత్తులపైనా చంద్రబాబు వివరణ ఇచ్చారు. రాష్ట్రాన్ని కాపాడేందుకే తెలుగుదేశం పార్టీ – జనసేన కలిసి ఎన్నికలకు వస్తున్నాయన్నారు. ఈ పరిణామంతోనే వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. 5 ఏళ్ల క్రితం నాటికి ఇప్పటికీ ఎవరి జీవన ప్రమాణాలైనా మారాయా? అని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి, గంజాయి మాత్రం ఇస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో ఘనంగా సాగయ్యే పంట గంజాయి మాత్రమేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సైకిల్ స్పీడు..
జనవరిలో సైకిల్ స్పీడ్ పెరుగుతుందని చంద్రబాబు అన్నారు. అదేసమయంలో ఫ్యాన్ రెక్కలు విరిగిపోతాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతాడో తెలీదంటూ.. ఆయనపై ఉన్న కేసులను పరోక్షంగా ప్రస్తావించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ తమ జీవితాలకు భద్రత కోరుకుంటున్నారని, కానీ జగన్ చెప్పిందేదీ చేయడని విమర్శలు గుప్పించారు.