ఏపీ రాజకీయాలు చాలా వరకు వెళ్తున్నాయి. ఇప్పటి వరకు అధికార పార్టీ వైసీపీ.. చంద్రబాబు పైనా.. టీడీపీ నేతలపైనా విమర్శలు చేయడం.. మంత్రి జోగి వంటివారు.. భౌతిక దాడులకు కూడా సిద్ధపడడం తెలిసిందే.ఇక, రాజకీయంగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించే వరకు కూడా.. రాజకీయాలు వెళ్లాయి. అయితే.. ఇప్పుడు కుట్ర రాజకీయాలు కూడా తెరమీదికి వచ్చాయి. ఏకంగా ఎన్నికల సమయంలో అనర్హులను చేసే వరకు ఇవి సాగడం గమనార్హం.
విషయం ఏంటంటే..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్తి ఎవరైనా.. నామినేషన్ వేయాల్సిందే. ఈ నామినేషన్‌తోపాటు.. అభ్యర్తులు తాము ఏ పనిచేస్తున్నామని.. తమకు ఉన్న ఆస్తులు ఎన్నని వివరించాలి. ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలకంగా చూసే మరో అంశం.. కేసులు. పోటీ చేసే అభ్యర్థిపై ఉన్న కేసులు ఎన్ని.. అవి ఎలాంటి కేసులు, ఏయే సెక్షన్ల కింద కేసులు పెట్టారు.. వంటి అన్ని అంశాలను కూడా నిర్ధారించాల్సి ఉంటుంది. దీనిని కూడా అఫిడవిట్ రూపంలోనే నామినేషన్‌కు జత చేయాలి. ఇవి కనుక తప్పని తేలితే.. ఎన్నికల్లో పోటీకే అనర్హుడిగా ప్రకటించే ప్రమాదం పొంచి ఉంది.
ఇక్కడే వైసీపీ ప్రభుత్వం కుట్ర చేసిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును కుప్పంలోనే ఓడిస్తామని ప్రతిజ్ఞ చేసిన వైసీపీ.. ఇప్పుడు ఆయనను అనర్హుడిని చేయాలనే కుట్ర చేస్తోందన్నది టీడీపీ నేతల వాదన. ఈ క్రమంలో చంద్రబాబుపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వకుండా డీజీపీతో నాటకాలు ఆడిస్తోందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికి రెండు సార్లు చంద్రబాబు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని డీజీపీకి లేఖలు రాశారు. ఆయన స్పందించలేదు. ఇది వైసీపీ సర్కారు చేస్తున్న కుట్రేనన్నది టీడీపీ నేతల ఆరోపణ.
హైకోర్టు జోక్యం..
ఈ వ్యవహారాన్ని టీడీపీ నాయకులు తాజాగా హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని పేర్కొంటూ పిటిషన్ వేశారు. ఒక్క చంద్రబాబు మాత్రమే కాకుండా.. నారా లోకేష్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ(నెల్లూరు సిటీ నుంచి బరిలో ఉన్నారు) కు సంబంధించిన కేసుల వివరాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దీనిని విచారించిన హైకోర్టు.. ఈ నెల 16లోగా కేసుల వివరాలు ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. అప్పటిలోగా ఇవ్వకపోతే.. చర్యలు తప్పవని హెచ్చరించడం గమనార్హం.