వైసీపీ ఎంపీ రఘురామను కొద్ది సంవత్సరాల క్రితం సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన తీరు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, కస్టడీలో తనను పోలీసులు కొట్టారని రఘురామ ఆరోపించడం, ఆ తర్వాత దానికి తగ్గట్లు రఘురామ అరికాళ్లకు గాయాలుండడం వంటి కారణాల నేపథ్యంలో సీఐడీ పోలీసుల తీరు విమర్శల పాలైంది. అయినా సరే, తమకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేవారిపై జగన్ మాత్రం కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు.
ఈ క్రమంలోనే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త, యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు వెంగళరావును కూడా రఘురామ తరహాలోనే అరెస్టు చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఇక, తనను కస్టడీలో పోలీసులు కొట్టారంటూ జడ్జిగారి ముందు స్వయంగా వెంగళరావు వాంగ్మూలం ఇవ్వడం, తన ఒంటిపై గాయాలను చూపించడం సంచలనం రేపింది. అయినా సరే, వెంగళరావును రిమాండ్ కు ఇవ్వాలని పోలీసులు పట్టుబట్టారు.
ఈ క్రమంలో పోలీసులకు షాకిస్తూ వెంగళరావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ సీఐడీ పోలీసుల రిమాండ్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలోనే సొంత పూచీకత్తుపై బెయిల్ సాధించుకున్న వెంగళరావుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. పోలీసులకు భయపడకుండా జడ్జికి వాంగ్మూలమిచ్చిన వెంగళరావు ధైర్యానికి చంద్రబాబు మెచ్చుకున్నారు.
చంద్రబాబు, వెంగళరావుల మధ్య ఫోన్ సంభాషణ యథాతధంగా…..
చంద్రబాబు: ప్రజలను, నీలాంటి వారిని భయభ్రాంతులకు గురిచేసి, తమ అరాచక పాలన కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొంత బాధపడినా గానీ, నువ్వు వీరోచితంగా పోరాడావు. నీ వెంట మేమందరం ఉంటాం. ఎలా పోరాడాలో మనమందరం ప్రజలకు సందేశం అందిద్దాం. ధర్మాన్ని కాపాడడమే మన లక్ష్యం… న్యాయమే గెలుస్తుంది.
వెంగళరావు: పోలీసులు నన్ను కొడుతూ మీ పేరు (చంద్రబాబు), లోకేశ్ బాబు పేరు చెబితే వదిలేస్తామన్నారు సర్.
చంద్రబాబు: ఎవర్నంటే వాళ్లని పట్టుకురావడం, వెధన పనులు, దరిద్రపు పనులు చేయడం వాళ్లకు అలవాటైపోయింది. వాళ్లకేమైనా బ్యాడ్జిలు ఉన్నాయా?
వెంగళరావు: వాళ్లకేమీ బ్యాడ్జిలు లేవు సర్… కానీ వాళ్లలో ఇద్దరు ముగ్గురు పేర్లు నాకు తెలుసు సర్… నేను వ్యక్తిగతంగా కలిసినప్పుడు వాళ్ల పేర్లు మీకు చెబుతాను సర్… వాళ్లకు మనం కచ్చితంగా తిరిగి ఇవ్వాలి సర్.
చంద్రబాబు: ఏదేమైనా మనం లాజికల్ గా, లీగల్ గా పోరాడాలి. చట్టాన్ని గౌరవించే బాధ్యతను అందరూ తీసుకోవాలి.
వెంగళరావు: మీరంతా నా వెనుక ఉన్నందుకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సర్. మీరు ఎంతో బిజీగా ఉండి కూడా నా కోసం శ్రమపడ్డారు సర్. నన్ను బయటికి తీసుకువచ్చేందుకు పార్టీ లీగల్ సెల్ ఎంతో కృషి చేసింది సర్.
చంద్రబాబు: లీగల్ సెల్ మాత్రమే కాదు, ఇలాంటివి జరిగినప్పుడు సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఖండించాలి. బాధితులకు సహకరించాలి. మనం పోరాటం కొనసాగిద్దాం.
వెంగళరావు: థాంక్యూ సర్.