తన హత్యకు కుట్ర జరుగుతోందని టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తన మర్డర్ కోసం రెక్కీ నిర్వహించారని రాధా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాధా వ్యాఖ్యలతో 2+2 గన్ మెన్ల భద్రతను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగా…రాధా దానిని తిరస్కరించారు. తనకు ప్రజా బలమే సెక్యూరిటీ అని అన్నారు. ఇక, రాధా రెక్కీ ఆరోపణల నేపథ్యంలో దేవినేని అవినాష్ అనురుడు ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వంగవీటి రాధాకు ఫోన్ చేసిన చంద్రబాబు…రెక్కీ వ్యవహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గన్మన్లు వద్దంటూ రాధా చెప్పడం సరికాదని, భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని రాధాకు చంద్రబాబు సలహా ఇచ్చారు. రాధాకు టీడీపీ మద్దతుగా ఉంటుందని, ఎవరైనా కుట్రలకు పాల్పడితే దానికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు.
రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాధాకు ఏమైనా జరిగితే దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని, ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి బాగోలేదని అన్నారు. ఏపీలో గతంలో జరిగిన హింసాత్మక ఘటనలు ఆటవిక పాలనను తలపిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోకపోవడంతోనే రాధాపై రెక్కీ వంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. కఠిన చర్యలే రాష్ట్రంలో ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడతాయని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.