పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలు రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో కల్తీ సారా తాగి దాదాపు 30 మంది వరకూ చనిపోవడం కలకలం రేపింది. అయితే, అవి సహజ మరణాలని, వాటికీ, ప్రభుత్వానికీ సంబంధం లేదని వైద్యశాఖ మంత్రి చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. ఇదంతా ప్రభుత్వం బాధ్యతా రాహిత్యమేనని ,ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆ వ్యవహారంపై చర్చకు టీడీపీ నేతలు గత ఐదారు రోజులుగా పట్టుబడుతున్నా…ఫలితం లేదు. వారిపై సస్పెన్ష్ వేటు వేసి సభ నుంచి బయటకు పంపుతున్న స్పీకర్…వైసీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి శాసనసభ వరకు ఖాళీ మద్యం సీసాలు, ప్లకార్డులతో టీడీపీ సభ్యులు పలుమార్లు నిరసన తెలిపారు.
టీడీపీ సభ్యులు సభ వెలుపల, లోపల, మీడియా సమావేశాల్లో నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై నిరసన తెలిపేందుకు టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కల్తీ సారా, నాటు సారా, నాసిరకం మద్యం బ్రాండ్లకు వ్యతిరేకంగా రెండు రోజులపాటు నిరసన కార్యక్రమాలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
జనాల ఇల్లు, ఒళ్లు గుల్ల చేస్తూ ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్న కల్తీ సారా, నాసిరకం జే-బ్రాండ్ మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చారు. మార్చి 19, 20 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టేందుకు సన్నాహాలు చేయాలని చెప్పారు.