కరోనా కట్టడిలో జగన్ విఫలమయ్యారంటూ స్వయంగా వైసీపీ ఎంపీలు, నేతలు మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ పై జగన్ చేతులెత్తేశారంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఇక, రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో కేంద్రం ఇస్తున్నవి గాక ఏపీ సొంతంగా కేవలం 13.5లక్షల వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇవ్వడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ డోసుల వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనున్న కేరళ వంటి రాష్ట్రాలు కోటికి పైగా డోసులు ఆర్డర్ ఇస్తే…. మన రాష్ట్రంలో 13 లక్షల టీకాలు ఏ మూలకు వస్తాయని ప్రశ్నించారు. మొత్తం వనరులన్నీ పోగుచేసి రాష్ట్రంలో ప్రజలందరికీ వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇవ్వాలని నిలదీశారు. కేబినెట్ భేటీలో 33వ అంశంగా కరోనాను ప్రస్తావించడం వైసీపీ చిత్తశుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు.
ప్రభుత్వం పెట్టిన డ్యాష్ బోర్డులో పడకలు, వెంటిలేటర్ల వివరాలలో కచ్చితత్వం లేదన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ముఖ్యనేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో వ్యాక్సినేషన్ తీరుకు నిరసనగా ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘టీకాలు వేయండి… ప్రాణాలు కాపాడండి’ అనే నినాదంతో నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
భారత్ లో కరోనా అధికంగా ఉన్న 33 జిల్లాల్లో 7 జిల్లాలు ఏపీలోనే ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. వ్యాక్సిన్ ఒక్కటే కరోనా నియంత్రణకు మార్గం అని స్పష్టం చేశారు. చంద్రన్న బీమా ఉంటే కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు వచ్చేవని గుర్తు చేశారు. కరోనా నియంత్రణపై సూచనలు చేస్తున్న తనపైనే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.