పల్నాడు జిల్లా మాచర్ల లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటికి, టీడీపీ కార్యాలయానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ శ్రేణులే ఈ ఘటనకు పాల్పడ్డాయని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గురజాల, పిడుగురాళ్లతోపాటు పలు చోట్ల టీడీపీ నేతలు నిరసనకు దిగారు. మాచర్లలో టీడీపీ నేతలపై దాడి ఘటనను ఖండిస్తూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకో, ధర్నాలు చేశారు.
ఇక, టీడీపీ నేతలు మాచర్లకు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించడం కలకలం రేపుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే మాచర్ల ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు ఈ ఘటనే నిదర్శనమని చంద్రబాబు దుయ్యబట్టారు. వైసీపీ నేతలు ఈ ఘటనకు మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు ఎందుకు స్పందించలేదని డీజీపీ రాజేంద్రనాథ్ ను ఫోన్ లో చంద్రబాబు ప్రశ్నించారు.
ఆ ఘటనకు బాధ్యులపై, గూండాలకు సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. మాచర్లలో అదనపు బలగాలను మోహరించామని, ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.