టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను సీఎం అయ్యే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టబోనని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే సభలోకి వస్తానని చంద్రబాబు ప్రకటించారు. అంతకుముందు, రెండో రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబుకు ఘోర అవమానం జరిగింది. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి, కుటుంబ సభ్యులపై కూడా వైసీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
పదే పదే చంద్రబాబును, టీడీపీ సభ్యులను అవమానిస్తూ మాట్లాడారు. దీంతో, చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో మైక్ కూడా స్పీకర్ కట్ చేశారు. దీంతో, కంటతడి పెట్టిన చంద్రబాబు…సభ నుంచి వాకౌట్ చేశారు. తాను సీఎం అయిన తర్వాతే మళ్లీ సభకు వస్తానని అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు.
అంతకుముందు, చంద్రబాబు సభలో కొడాలి నాని తదితరుల వ్యాఖ్యలపై స్పందించారు. ఇన్నేళ్లూ ఎన్నో అవమానాలు పడ్డానని, తన భార్య, తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధించిందని అన్నారు. తన భార్యను అవమానించి, తన కుటుంబ సభ్యులను కూడా రోడ్డుపైకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేని అవమానాలు భరించానని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
సభలో ఎన్నో చర్చలు చూసినా…. ఇంత అవమానం ఎప్పుడూ ఎదుర్కోలేదని తీవ్ర భావోద్వేగంతో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగానే చంద్రబాబు మాట్లాడుతుండగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారు. ఆయన వెంటే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బయటికొచ్చేశారు. అయితే, టీడీపీ సభ్యుల వాకౌట్ సందర్భంగా జగన్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అవహేళనగా నవ్వుతూ ఉండటం గమనార్హం.