ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముస్లింలకు జగన్ తీరని ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన పథకాలను నిలిపివేసి.. తమషాలు చేస్తున్నాడని ఫైరయ్యారు.
ముస్లింలకు రంజాన్ తోఫా, వివాహాలకు దుల్హన్ ద్వారా ఆర్థికసాయం చేసినది టీడీపీ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు.
ముస్లింలకు ఏమీ ఇవ్వకుం డానే ఎంతో చేసినట్టు జగన్ చెప్పుకొంటున్నారని దుయ్యబట్టారు.
గుంటూరు జిల్లా పొన్నూరులో మైనార్టీల ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.
ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చిన ప్రభుత్వం తమదని తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీలో మతకలహాలు రూపు మాపింది తమ సర్కారనేనని ఉద్ఘాటించారు.
పేదరికంలో మగ్గే ముస్లిం పిల్లల వివాహాలకు దుల్హన్ ద్వారా ఆర్థికసాయం చేశామని ఆయా వివరాలను వారికి చూపించారు. అయితే, సీఎం జగన్ తన ప్రభుత్వంలో వాటిని తీసేశాడని అన్నారు.
దుల్హన్ పథకానికి అడ్డగోలు నిబంధనలు పెట్టి దూరం చేసిందని.. తాము అధికారంలోకి వచ్చాక దుల్హన్ పథకం మళ్లీ అమలు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
మైనార్టీ పిల్లలకు విదేశీ విద్యా దీవెన అమలు చేశామన్న బాబు.. ప్రపంచంలో మంచి వర్శిటీలో చదువుకునే అవకాశం కల్పించామన్నారు.
పోటీ ప్రపంచంలో వారు నిలబడేలా అండగా ఉన్నామని ముస్లింలకు చంద్రబాబు వివరించారు.
హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధి చేశానని.. చంద్రబాబు తెలిపారు. ఐటీ డెవలప్మెంట్ ద్వారా హైదరాబాద్లో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని.. ముస్లిం అమ్మాయిలు చదువుకుని అబ్బాయిలకు పోటీగా ఉద్యోగాలు సాధించారని వ్యాఖ్యానించారు.
జగన్ సర్కారు ముస్లిం మైనార్టీ పిల్లల చదువులకు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.
కాగా, చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమానికి భారీ సంఖ్యలో మైనార్టీ ముస్లిం సంఘాల నాయకులు హాజరయ్యారు.