టీడీపీ 40వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అంబరాన్నంటేలా సంబరాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీకికి కార్యకర్తలే కంచుకోట అని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన బాలయ్య… పోరాటమే మన ఊపిరి అని… ఎన్టీఆర్ కు మనం అందించే నివాళి ఇదేనని చెప్పారు. పార్టీ ఈ స్థాయిలో ఉండటానికి లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ప్రజల ఆశీస్సులే కారణమని బాలయ్య చెప్పారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో టీడీపీ కొత్త శకాన్ని లిఖించిందన్నారు.
టీడీపీ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా తన తండ్రి నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్)ను బాలయ్య స్మరించుకున్నారు. ఆ మహానుభావుడు ఎన్టీఆర్ పార్టీని ప్రకటించిన ముహూర్త బలం చాలా గొప్పగా ఉందని, అందుకే నాలుగు దశాబ్దాలుగా తెలుగునాట పసుపుజెండా సమున్నతంగా రెపరెపలాడుతుందని అన్నారు. పోరాటమే మన ఊపిరని చాటాలి, విజయమే లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆ మహనీయుడు ఎన్టీఆర్ కు మనం అందించే నివాళి అదేనన్నారు. ఆచంద్రతారార్కం తెలుగుదేశం అజరామరం… జోహార్ ఎన్టీఆర్…తెలుగుదేశం వర్ధిల్లాలి అని బాలకృష్ణ అన్నారు. పుష్కరకాలం ఎన్టీఆర్ నాయకత్వంలో, గత 28ఏళ్లుగా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం సాధించిన విజయాలు అనన్యసామాన్యం అని కొనియాడారు.
రాష్ట్రాభివృద్ధిలో, పేదల సంక్షేమంలో టీడీపీకి ముందు, టీడీపీ తర్వాత అనేలా చరిత్రను తిరగరాశామని అన్నారు.ఆడబిడ్డలకు ఎన్టీఆర్ ఆస్తిహక్కును కల్పించారని, అది దేశానికే దిక్సూచిగా మారిందని చెప్పారు. పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టింది టీడీపీనే అని, ఎత్తిపోతల పథకాలతో రాష్ట్రం అన్నపూర్ణగా మారడానికి టీడీపీనే కారణమని చెప్పారు. పారిశ్రామికీకరణకు చంద్రబాబు బ్రాండ్ అంబాసడర్ అని, దేశ, విదేశాల నుంచి పెట్టుబడులను రాబట్టిన ఘనత చంద్రబాబుదని కొనియాడారు. పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే టీడీపీ రథ చక్రాలని చెప్పారు. కార్యకర్తలే టీడీపీ ప్రగతి రథానికి చోదకశక్తులని అన్నారు. 40 ఏళ్లు కాదు.. 400 ఏళ్లయినా తెలుగువారి గుండెల్లో టీడీపీ సజీవంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. దుష్ట శక్తులు ఎన్ని ఆటంకాలు కల్పించినా.. మన కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారని అన్నారు.