ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో.. ఇప్పుడున్న మీడియా వ్యవస్థలో ఇదిగో తోక అంటే.. అదిగో పెద్ద పులి.. ఆ ఊరెళ్లి.. ఈ ఊరుకు వచ్చి.. ఇప్పుడే ఫలానా ఊరికి వెళ్లిందని.. అది వేసుకున్న బట్టల రంగుతో సహా చెప్పేసే సిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒక రాజకీయ ప్రముఖుడు ఏం చేసినా.. దాని పేరుతో ఒక విశ్లేషణ రాయటం.. సుమారు చూసి కొట్టేసేలా అభిప్రాయాల్ని వ్యక్తం చేయటం అలవాటుగా మారింది. స్కిల్ స్కాంలో జైలుకు వెళ్లిన ఏపీ విపక్ష నేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ తో భాగంగా విడుదల కావటం తెలిసిందే.
అనారోగ్య కారణాలు.. కంటికిజరిగిన శస్త్ర చికిత్స కారణంగా కొన్ని రోజులుగా ఇంటికే పరిమితం కావటం తెలిసిందే. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన ఎక్కడా.. ఏ కార్యక్రమానికి హాజరైంది లేదు. అందుకు భిన్నంగా ఆయన తాజాగా ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. మిగిలిన వారి అంచనాలకు భిన్నంగా చంద్రబాబు ఢిల్లీ టూర్ వెనుక అసలు ఉద్దేశం తాజాగా బయటకు వచ్చింది.
ఆయన ప్రముఖ న్యాయవాది.. తన స్కిల్ స్కాం కేసు కోసం రోజులు తరబడి చంద్రబాబు వెంబడి ఉన్న ప్రముఖ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కొడుకు పెళ్లి రిసెప్షన్ కు హాజరయ్యారు. భార్య భువనేశ్వరితో కలిసి ఢిల్లీకి వచ్చిన చంద్రబాబుకు పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ దంపతులు.. ఎంపీలు కేశినేని నాని.. రామ్మోహన్ రాయుడు.. వైసీపీ ఎంపీ రఘరామ క్రిష్ణరాజు తదితరులు స్వాగతం పలికారు.
ఏపీ స్కిల్ స్కాం ఆరోపణలు.. చంద్రబాబు అరెస్టు.. మధ్యంతర బెయిల్ తర్వాత ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లింది లేదు. హైదరాబాద్ లోనే ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన హాజరైన మొదటి కార్యక్రమం తన లాయర్ కొడుకు రిసెన్షన్ కు హాజరుకావటమే. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన లాయర్ ఇంట్లో జరిగే పెళ్లికి వెళ్లటం తప్పనిసరి. ఆ మాత్రం రిలేషన్ మొయింటైన్ చేయాల్సిందే.