వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్కరూ సంతోషంగా లేరని.. ఏం సాధించారని ప్లీనరీ నిర్వహిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించిన బాబు.. వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. ప్రతివర్గాన్నీ అవస్థలకు గురిచేస్తున్న ప్రభుత్వంపై పోరాటానికి ఇంటికి ఒకరు చొప్పున రావాలని పిలుపునిచ్చారు. జగన్ పాలనను దునుమాడిన అధినేత.. తాను సంధించిన ప్రశ్నలకు ప్లీనరీ వేదికగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. చంద్రబాబు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న బాబు.. నగరి నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించారు. “వైసీపీ ప్రభుత్వం ప్రజలపై ఎంత పెనుభారం మోపుతుందో చెప్పేందుకు వచ్చా. జగన్ పాలనలో ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా? జగన్ పాలన మొత్తం అవినీతిమయమైంది. ఈ ప్రభుత్వం నవ రత్నాలు కాదు.. నవ ఘోరాలకు పాల్పడుతోంది. ఏం సాధించారని ప్లీనరీ నిర్వహిస్తున్నారు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.“ అని చంద్రబాబు మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయన్నారు. దేశమంతా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే ఇక్కడ తగ్గించలేదని దుయ్యబట్టారు. తమిళనాడుకు వెళ్లి బైకుల్లో పెట్రోల్ నింపుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. మద్యం ధరలు విపరీతంగా పెంచారని నిప్పులు చెరిగారు. మద్యం ధరలు పెంచి.. జగన్ వ్యక్తిగత ఆదాయం పెంచుకుంటున్నారని అన్నారు. అయినా.. నాణ్యమైన మద్యం దొరకట్లేదని, రాష్ట్రంలో నాసిరకం మద్యం విక్రయిస్తున్నారని, ఈ మద్యం ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
ఎన్నికల హామీలు..
ఇష్టారీతిన విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారని బాబు అన్నారు. చెత్త మీద కూడా పన్ను వేసిన ఘనత జగన్‌దే నన్నారు. టీడీపీ హయాంలో పవర్‌లూమ్స్‌కు విద్యుత్ ఛార్జీల్లో 50 శాతం రాయితీ ఇచ్చామని తెలిపారు. టీడీపీ వచ్చిన వెంటనే పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు జగన్ ఇచ్చిన పింఛన్ల హామీ ఏమైందని నిలదీశారు. “ఒంటరి మహిళలు, వితంతువుల పింఛన్లు రద్దు చేశారు. చేనేత కార్మికులకు టీడీపీ పూర్తి అండగా ఉంటుంది. నానో టెక్నాలజీ తీసుకువచ్చి కాలుష్యం లేకుండా చూస్తాం. కాలుష్య రహిత ‘నగరి’ తయారు చేసే బాధ్యత తీసుకుంటా. అధికారంలోకి వచ్చాక నగరిలో జౌళిపార్కు ఏర్పాటు చేస్తాం.“ అని చంద్రబాబు హామీలు గుప్పించారు