మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న వార్త ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. టెన్త్ పేపర్ల లీక్ కేసులో ఆయనను అరెస్టు చేశారని, చిత్తూరుకు తరలిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులిచ్చేందుకు రంగం సిధ్ధం చేశారన్న వార్త ప్రకంపనలు రేపుతోంది.
అమరావతి ల్యాండ్ పూలింగ్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలతో ఏపీ సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలుస్తోంది. ఈ ఎఫ్ఐఆర్ లో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ3గా లింగమనేని రమేశ్, ఏ4గా లింగమనేని శేఖర్, ఏ5గా అంజనీ కుమార్, ఏ6గా హెరిటేజ్ ఫుడ్స్ ను పేర్కొన్నారని సమాచారం. మొత్తం 14 పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చగా..వాటిలో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ ఉన్నారు. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు ప్రకారం ఈ కేసు నమోదైంది. నిన్ననే సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలుస్తోంది. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగురోడ్డు డిజైన్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదుతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసిన సీఐడీ అధికారులు ప్రాథమికంగా దర్యాప్తు చేశారని తెలుస్తోంది. అయితే, నారాయణను ల్యాండ్ పూలింగ్ కేసులో అదుపులోకి తీసుకున్నారా లేదంటే టెన్త్ పేపర్ల లీక్ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్నారా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇటు నారాయణ అరెస్టుపైగానీ, అటు ల్యాండ్ పూలింగ్ ఎఫ్ఐఆర్ పై గానీ సీఐడీ పోలీసులు, అధికారులు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.