రామతీర్థం ఘటనలో ప్రభుత్వం, ఏపీ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పర్యటనకు ఆటంకం కలిగించే ఉద్దేశ్యంతోనే విజయసాయి అక్కడ పర్యటించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అన్ని అనుమతులున్న చంద్రబాబును అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు…విజయసాయిని మాత్రం దగ్గరుండి గర్భగుడి దర్శనం చేయించి పంపడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. విజయసాయి కారుపై దాడి ఘటన నేపథ్యంలో చంద్రబాబుతోపాటు, పార్టీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులపై కేసు నమోదు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, రామభక్తుడు సూరిబాబుపై కూడా వేరే కేసు పెట్టడంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరును టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుబట్టారు. రామతీర్థం ఘటనలో అసలైన దోషులను పట్టుకోవడం మానేసి, అమాయకుడైన రామభక్తుడు సూరిబాబును తప్పు ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నారని ఆరోపించారు.
రామభక్తుడు సూరిబాబుతో తెల్లకాగితాలపై సంతకాలు తీసుకోవడాన్ని చంద్రబాబు ఖండించారు. అధికారులు కోరినందునే ప్రమాదకరమైన బావిలోకి సూరిబాబు దిగారని, అటువంటి సూరిబాబు కుటుంబానికి ద్రోహం చేయాలనుకోవడం ఏమిటని మండిపడ్డారు. రామతీర్థం ఘటనను టీడీపీ మీదకు నెట్టాలనుకునే కుట్రలను సహించబోమని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు వాటర్ ప్యాకెట్లు విసిరేస్తే, టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టడం సిగ్గుమాలిన చర్య అని దుయ్యబట్టారు. ప్రభుత్వం చెప్పిన దాన్ని గుడ్డిగా అనుసరిస్తూ దేవుడి విషయంలో పాపం మూటగట్టుకోవద్దని పోలీసులకు చంద్రబాబు హితవు పలికారు. జగన్ పాలనలో హిందువులు, ఆలయాలు, దేవుళ్ల విగ్రహాలపై దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనల్లో పోలీసులు, ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు.