ఏలూరు జిల్లా అక్కిరెడ్డి గూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృత్యువాత పడగా…పదుల సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతుండగా…కార్మికుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని యాజమాన్యం చెబుతోంది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.
ప్రమాదంలో పలువురు చనిపోవడం పట్ల చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో కార్మికుల రక్షణ పట్ల సంస్థలు రాజీ పడకూడదని,ప్రభుత్వం కూడా నిత్యం తనిఖీలు చేయాలని సూచించారు. ఈ ప్రమాదానికి కారకులపై వారిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, ఆర్టీసీ బస్సు చార్జీలను బుధవారం నుంచి పెంచుతూ జగన్ ప్రభుత్వం తీసుకుకన్న నిర్ణయంపై చంద్రబాబు మండిపడ్డారు. ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా గురువారం నుంచి ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లోని ఆర్టీసీ బస్టాండ్ల వద్ద నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు.
బాదుడే బాదుడులో భాగంగా జగన్ సర్కారు ఇప్పుడు ఆర్టీసీ చార్జీలను పెంచిందని, జగన్ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ చార్జీల పెంపు ఇది రెండోసారిన ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలను ఇష్టారాజ్యంగా పెంచేసిన జగన్.. తాజాగా ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ బాదుడును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యకర్తు, నేతలు ముమ్మరంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.