ఏపీలో రాబోయే ఎన్నికల వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా పార్టీల అధినేతలు తమ నేతలను, కార్యకర్తలను, క్యాడర్ ను అందుకు తగ్గట్టుగా సమాయత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సమావేశాలు,సదస్సులు నిర్వహిస్తూ అన్ని స్థాయిల్లోని నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జిల్లాల వారీగా నేతలతో భేటీ అయి వారితో చర్చలు జరిపి కార్యచరణ రూపొందిస్తున్నారు.
వైసీపీ బలహీనపడుతున్న తరుణంలో టీడీపీ మరింత బలపడేందుకు చేపట్టాల్సిన చర్యలేమిటో నిర్దేశిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై దాడి జరిగిన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఇటువంటి కీలక భేటీకి కొందరు టీడీపీ కీలక నేతలు డుమ్మా కొట్టారు. దీంతో, సదరు నేతలపై పార్టీ అధినేత చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులు ఈ భేటీకి గైర్హాజరు కావడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశఆరు. కేశినేని నాని ఢిల్లీలో ఉండగా..దేవినేని ఉమ, బోండా ఉమలు విదేశీ పర్యటనలో ఉన్నారు. మరోవైపు, కృష్ణా జిల్లా నేతల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడిపై సొంత జిల్లాకు చెందిన నేతలే స్పందించకపోవడం దారుణమని చంద్రబాబు ఫైర్ అయ్యారు.
ఇకనైనా నేతల తీరు మారాల్సి ఉందని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. పరిస్థితిలో మార్పు రాకపోతే సహించేది లేదని సదరు నేతలను హెచ్చరించారు. జిల్లాలో నేతలంతా ఉమ్మడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.