వైసీపీ పాలనలో ప్రభుత్వ కార్యాలయాలు మొదలు పచ్చదనం ఇచ్చే చెట్ల వరకు అన్నిటికి వైసీపీ రంగులు వేయాలని ఆ పార్టీ కార్యకర్తలు ఉత్సాహపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ వ్యవహారంపై కోర్టు మొట్టికాయలు వేయడంతో వైసీపీ నేతలు ఆ రంగులు తొలగించి దానికి దగ్గర దగ్గరగా ఉండే రంగులు వేసి సంతృప్తి చెందుతున్నారు. ఇలా అవకాశం వచ్చిన ప్రతిసారి వైసీపీ రంగుతో పాటు తమ అధినేత జగన్ ఫోటోలుగాని పేరునుగాని హైలెట్ చేసేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉవ్విళ్లూరుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా తిరుపతిలో జరుగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా మరోసారి వైసీపీ నేతలు తమ జగన్ స్వామి భక్తిని చాటుకున్నారు. గంగమ్మ ఆలయం ముందు చేసిన అలంకారంలో జగన్ పేరు వచ్చేలాగా ఎలక్ట్రికల్ బల్బులతో లైటింగ్ వేయడం వివాదానికి దారి తీసింది. జే అనే అక్షరం రాసి దాని పక్కన గన్ బొమ్మ వేయడం, ఆ పేరుకు పక్కనే అటు, ఇటు వైసీపీ జెండా కూడా ఉండటం వివాదాస్పదంగా మారింది.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి గంగమ్మ గుడికి ఇటువంటి అలంకారం ఏమిటి అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. దేవుని సన్నిధిలో ఈ గన్ కల్చర్ ఏమిటని మండిపడ్డారు. గుడిలో వైసీపీ జెండా గుర్తులు ఏమిటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు ఏమైనా పిచ్చి పట్టిందా అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఈ ప్రచార పిచ్చితో, అహంకారంతో దేవుళ్ళ దగ్గర ఇలాంటి వేషాలు వేయడం ఏమిటని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరి, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత అయినా సరే ఆ జగన్ పేరు, వైసీపీ జెండాలను తొలగిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.