ఉత్తరాంధ్రలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా నేడు అనకాపల్లికి వచ్చిన చంద్రబాబుకు బెల్లం వ్యాపారులు ఘన స్వాగతం పలికారు. బెల్లంతో తయారుచేసిన గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు.జగన్ డబ్బు పిశాచి అని, ఎంత సంపాదించినా సరిపోవడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలోని సంపదంతా జగన్ కే కావాలని, డబ్బు కోసం ఎవరినైనా చంపేస్తాడని వివేకా హత్య గురించి పరోక్షంగా ప్రస్తావించారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ అట్టడుగు స్థాయికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో టాప్ 5 రాష్ట్రాల జాబితాలో ఏపీ ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ 14వ ర్యాంకులో కొనసాగుతోందని విచారం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ ఒక్క పెట్టుబడిదారుడు ముందుకు రావడం లేదని, రాష్ట్ర ప్రభుత్వంపై ఇన్వెస్టర్లకు నమ్మకం కలగడం లేదని అన్నారు.
దేశంలో అత్యంత సంపన్న సీఎం అయిన జగన్ తన సంపదను గురించే తపనపడుతున్నారని, సొంత డబ్బా కొట్టుకోవడంతోనే కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని, పరిశ్రమలు వస్తే రాష్ట్ర యువతకు ఉద్యోగాలు వస్తాయని జగన్ ఆలోచించడం లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ఇటువంటి పాలకులు అవసరం లేదని చంద్రబాబు పిలుపునిచ్చారు.
జగన్ ను, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఇది న్యాయమా? అని ప్రశ్నించారు. రోడ్ షోలను నిషేధించేందుకు జగన్ ప్రయత్నించి భంగపడ్డారని అన్నారు. తన రోడ్ షోలకు సహకరిస్తున్న పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. నీతి నిజాయతీకి మారుపేరైన ఉత్తరాంధ్ర జిల్లాలను వైసీపీ నాశనం చేస్తోందన్నారు. వైసీపీ గద్దలు విశాఖపై వాలి దోచేస్తున్నాయని ఆరోపించారు