టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులను అడ్డుపెట్టుకొని పాదయాత్రకు అడ్డు తగలడం, నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్, టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. మొన్న బంగారుపాళ్యంలో వాహనాలను సీజ్ చేసిన పోలీసులు…ఈ రోజు లోకేష్ ప్రసంగిస్తుండగానే..స్టూల్ ను లాక్కునే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలోనే పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏం నిబంధనలు అతిక్రమించాడని లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారని చంద్రబాబు నిలదీశారు. బయటికి రాకుండా అందరినీ బెదిరించి చంపేస్తారా? అంటూ పోలీసుల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ఓటమి ఖాయమని అన్ని సర్వేలు చెబుతున్నాయని, ఆ భయంతోనే ముందస్తు ఎన్నికలకు జగన్ వెళ్లాలనుకుంటున్నారని జోస్యం చెప్పారు.
ముందస్తు ఎన్నికలు వస్తే రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా చంద్రబాబు స్పందించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్లు ట్యాప్ చేసి నివేదికలిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ నివేదికలతో సీఐడీ అధికారి రఘురామిరెడ్డి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వాస్తవమని, తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఖరికి జడ్జిల ఫోన్లు సైతం ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులను వదిలేది లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.