వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సాధ్యం కాదనుకున్న పొత్తును సాధ్యం చేశారు. బీజేపీని ఒప్పించి టీడీపీతో చేతులు కలిపేలా చేశారు. మొత్తంగా బీజేపీ-జనసేన-టీడీపీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అంతర్గతంగా ఏర్పడిన చిన్న పాటి వివాదాలు పక్కన పెడితే.. మొత్తంగా మూడు పార్టీలు ఉమ్మడిగా అయితే జతకట్టాయి.
ఇక, ఇప్పటి వరకు మూడు పార్టీలు ఉమ్మడిగా ఒక సభను మాత్రమే నిర్వహించాయి. చిలకలూరి పేటలో నిర్వహించిన ప్రజాగళం సభకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. ఆ తర్వాత.. మూడు పార్టీ లూ ఉమ్మడిగా ఎలాంటి సభలు నిర్వహించలేదు. ఇక, టీడీపీ-జనసేనలు సంయుక్తంగా దీనికి ముందు తాడేపల్లి గూడెంలో సభ పెట్టాయి. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత.. ఈ రెండు పార్టీలు కూడా ఉమ్మడి సభలు పెట్టలేదు. ప్రస్తుతం ఎవరికి వారే.. సభలు , సమావేశాలు పెట్టుకుంటున్నారు.
దీనివల్ల క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల కార్యకర్తలు చేతులు కలపడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఒకటి రెండు నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన-టీడీపీ కార్యకర్తలు కలసి పనిచేస్తున్నారు. మిగిలిన చోట్ల మాత్రం కలిసి ముందుకు వెళ్లడం లేదు. దీనిపై దృష్టి పెట్టిన జనసేన, టీడీపీ ఇప్పుడు పంథా మార్చుకున్నాయి. ఈ క్రమంలో అత్యవసర ప్రాతిపదికన.. ఈ రెండు పార్టీలూ.. ఉమ్మడిగా ముందుకు సాగాలని నిర్ణయించాయి.
దీనిలో భాగంగా ఉగాది మర్నాడే.. రెండు రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాలో జనసేన-టీడీపీ కలిసి ఉమ్మడి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నాయి. నిడదవోలు, అమలాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్‌లు ప్రచారం చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఊపు వస్తుందన్నది జనసేన అభిప్రాయంగా ఉంది. ఈ రెండు జిల్లాల్లోనూ జనసేన, టీడీపీకు బలమైన కార్యకర్తలు ఉండడం.. నాయకులుకూడా.. ఉండడంతో ఈ జిల్లాల్లో ఉమ్మడి సభలు నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ముందుకు వచ్చేలా చేయాలన్నది పవన్ స్కెచ్. మరి చూడాలి… ఏమేరకు సక్సెస్ అవుతుందో.