స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయిన వెంటనే వైసీపీ నేత రోజా పండగ చేసుకొని, మిఠాయిలు పంచి టపాసులు కాల్చిన వైనం తెలిసిందే. రోజాలా కాకపోయినా లోలోపల వైసీపీ నేతలంతా పండగ చేసుకున్నారని వారి కామెంట్లను బట్టే తెలుస్తోంది. ఈ స్కిల్ స్కాం కేసే కాదు…చంద్రబాబుపై మరిన్ని కేసులు పెట్టే అవకాశముందని వైసీపీ నేతలు హింట్ ఇస్తూ వస్తున్నారు. ఆ క్రమంలోనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబుపై ఏపీ సీఐడీ అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇక, తాజాగా ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబుపై పీటీ వారెంట్ ను విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన వైనం సంచనలం రేపుతోంది.
ఆ స్కాంలో చంద్రబాబే ప్రధాన ముద్దాయి అంటూ పీటీ వారెంట్ లో సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఆ పీటీ వారెంట్ ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో, ఈ రోజు చంద్రబాబుకు బెయిల్ లభిస్తుంది అని ఆశించిన టీడీపీ శ్రేణులకు షాక్ తగిలినట్లయింది. ఫైబర్ నెట్ స్కాంలో రూ.121 కోట్లు దారిమళ్లాయని, ఆల్రెడీ సిట్ దర్యాప్తు చేసిందని సీఐడీ తెలిపింది. 2021లోనే 19 మందిపై కేసు నమోదు కాగా, బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెర్రా సాఫ్ట్ కంపెనీకి అక్రమంగా టెండర్ ఇచ్చారని ఆరోపించింది. అంతేకాదు, ఈ కేసులో లోకేష్ పాత్ర కూడా ఉందని, ఏ1గా వేమూరి హరిప్రసాద్, ఏ2గా మాజీ ఎండీ సాంబశివరావు ఉన్నారని తెలిపింది.