ఈ నెల మొదటివారంలో జరుగుతుందని అనుకుంటున్న కేంద్ర మంత్రిర్గం పునర్ వ్యవస్ధీకరణలో ఏపీ ఛాన్స్ పై చర్చలు పెరిగిపోతున్నాయి. గడచిన నాలుగేళ్ళుగా ఏపీ నుండి ఎవరినీ కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోలేదు. 2014లో నరేంద్రమోడీ మంత్రివర్గం ఏర్పడినపుడు మిత్రపక్షం కోటాలో అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి ఉండేవారు. అయితే ఎన్డీయేలో నుండి చంద్రబాబునాయుడు బయటకు వచ్చేయటంతో మంత్రులిద్దరు రాజీనామాలు చేశారు. అప్పటినుండి ఏపీ కోటాలో ఎవరికీ అవకాశం దక్కలేదు. అయితే తొందరలోనే ఎన్నికలు రాబోతున్నాయి కదా అందుకనే ఏపీకి ఈసారి ఛాన్స్ ఉంటుందనే ప్రచారం మొదలైంది.
ఏపీకి గనుక ఛాన్స్ ఇవ్వాలంటే ఇద్దరికే అవకాశముంది. ఒకళ్ళేమో సీఎం రమేష్, రెండో నేతేమో జీవీఎల్ నరసింహారావు. ఇద్దరు రాజ్యసభ ఎంపీలే. సీఎం రమేష్ టీడీపీ తరపున రాజ్యసభకు ఎంపికై బీజేపీలోకి మారిపోయారు. జీవీఎల్ మొదటినుండి బీజేపీలోనే ఉంటున్నారు. యూపీ కోటాలో రాజ్యసభకు ఎంపికైన జీవీఎల్ పార్టీలోని అగ్రనేతలతో పాటు మోడీ, అమిత్ షా తదితరులతో కూడా బాగా సన్నిహితంగా ఉంటారు. పార్టీ వాణిని బలంగా వినిపిస్తుంటారు.
అయితే పార్టీకోసం కష్టపడి పనిచేయటం, పార్టీవాణిని బలంగా వినిపించటం మాత్రమే జీవీఎల్ కు తెలుసు. గతంలో ఎన్నికలు జరగిన రాష్ట్రాల్లో పార్టీ తరపున కష్టపడిపనిచేసిన అనుభవం కూడా ఉంది. అంటే నాయకత్వానికి జీవీఎల్ మీద పూర్తి నమ్మకం ఉందనే అనుకోవాలి. అయితే పార్టీ బాధ్యతలు నిర్వర్తించటం మినహా ఇతరత్రా వ్యవహారాలను జీవీఎల్ చక్కబెట్టలేరు, పార్టీని ఆర్ధికంగా ఆదుకునేంత సీన్ జీవీఎల్ లో లేదు.
ఇదే సమయంలో ఆర్ధికంగా సీఎం రమేష్ గట్టిస్ధితిలో ఉన్నారు. అవసరమైతే ఎంత డబ్బయినా పార్టీకోసం ఖర్చుపెట్టగల స్తోమతుంది. కానీ పార్టీలో పట్టులేదు, అగ్రనేతల గుడ్ లుక్సులో లేరన్నది వాస్తవం. పార్టీకి జీవీఎల్, సీఎం రమేష్ లాంటి నేతలు ఇద్దరూ అవసరమే. అందుకనే ఇద్దరికీ సమాన అవకాశాలున్నట్లు పార్టీవర్గాలే చెబుతున్నాయి. అయితే ఇక్కడో ఇంకో సమస్య కూడా ఉంది. అదేమిటంటే ఏపీనుండి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించినా రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ఉపయోగం ఉండదన్నది వాస్తవం. కాబట్టి అసలు ఏపీకి మంత్రివర్గంలో ఎందుకు అవకాశం ఇవ్వాలని మోడీ ఆలోచిస్తే అప్పుడు పరిస్ధితేంటి?