తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలపైకి మళ్ళింది. వైసిపి మరోసారి అధికారాన్ని చేపట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా… ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకొని అధికారంలోకి రావాలని టీడీపీ భావిస్తుంది. దీనికి తోడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత వైసిపి ఆత్మ రక్షణలో పడిన నేపథ్యంలో జనసేనను కలుపుకొని జగన్ కు గుణపాఠం చెప్పాలని టిడిపి నేతలు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రాజకీయ సర్వేలు నిర్వహించే ‘మిషన్ చాణక్య’ సంస్థ అధినేత పార్థా దాస్…ఏపీ ఎన్నికల ఫలితాలపై చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో తమ సంస్థ సర్వేలో భాగంగా తొలి శాంపిల్ తీశామని, ఆ సర్వేలో టిడిపికి 51 శాతం మంది మద్దతు పలికారని వెల్లడైందని ఆయన ట్వీట్ చేశఆరు. ఇక, అధికార పార్టీ వైసీపీకి 36 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారని ఆ సర్వేలో వెల్లడైంది.
జగన్ ముఖ్యమంత్రి కావాలని 38 శాతం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని 38 శాతం మంది కోరుకుంటున్నారట. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని 43 శాతం మంది కోరుకోగా..మోడీకి 40 శాతం మంది జైకొట్టారు. ఇటీవల వెలువడిన తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు కూడా పార్థ దాస్ అంచనాలకు తగ్గట్టుగానే వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, రాబోయే ఎన్నికలలో మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలలో పార్టీకి ఆదరణ పెరుగుతోందని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశాలలో కూడా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతాయని అభిప్రాయపడ్డారు. ఆ ప్రభావం ఇండియా కూటమి బలోపేతం అయ్యేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తరాదిలో 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికలలో ఇండియా కూటమి బలంగా మారే అవకాశాలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే దేశంలోని రాజకీయ పరిణామాలు ముందు ముందు ఆసక్తికరంగా మారబోతున్నాయని పార్థా దాస్ కొద్ది రోజుల క్రితం ట్వీట్ చేశారు.
ఆయన చెప్పినట్లుగానే కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కొద్ది నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు పార్థా దాస్ అంచనాలకు దగ్గరగా ఉన్నాయి. కన్నడనాట కాంగ్రెస్ పార్టీ 120కి పైగా సీట్లు సాధిస్తుందని పార్థా అంచనా వేయగా, ఆ పార్టీ 135 సీట్లు కైవసం చేసుకుంది. దీంతో, ఏపీలో ఫలితాలు కూడా దాదాపుగా నిజమవుతాయని టాక్ వస్తుంది.
పార్థా దాస్ చేపట్టిన సర్వే ఫలితాలు యధాతథంగా….
అసెంబ్లీ ఎన్నికలు
టీడీపీ -51%
వైసీపీ – 36%
జనసేన – 10%
ఇతరులు -3%
లోక్ సభ ఎన్నికలు
టీడీపీ -53%
వైసీపీ – 38%
జనసేన – 6%
కాంగ్రెస్ -3%
ముఖ్యమంత్రి అభ్యర్థి
చంద్రబాబు – 38%
జగన్- 38%
లోకేష్ – 15%
పవన్ – 10%
ప్రధాని అభ్యర్థి
రాహుల్ గాంధీ – 43%
మోడీ- 40%
ఎవరైనా పర్లేదు – 18%