రాజకీయాలలో సెంటిమెంట్లను చాలామంది నమ్ముతుంటారు. కొందరు నేతలు ఓడిపోయినప్పుడు పార్టీ గెలుస్తుందని.. పార్టీ ఓడిపోయినప్పుడు ఆ నేతలు గెలుస్తారని.. ఇలా అనేక రకాలుగా నమ్మకాలుంటాయి.
ఏపీలోని కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలోనూ అలాంటి సెంటిమెంటు ఒకటి ఉంది. గత 15 సంవత్సరాలుగా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఓ నేత ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోతోంది. ఆయన కూడా ఓటమిపాలవుతున్నారు. తాజాగా ఆయన మరోసారి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు.
ఆయనే చలమలశెట్టి సునీల్. గత మూడు లోక్ సభ ఎన్నికలలో మూడు పార్టీల నుంచి పోటీ చేసిన ఆయన పోటీ చేసిన ప్రతిసారీ ఓటమి పాలయ్యారు. అంతేకాదు.. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేశారో ఆ పార్టీ కూడా ఓటమి పాలైంది. ఈసారి ఆయన వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు.
దీంతో సునీల్ గెలిచి వైసీపీని గెలిపిస్తారో.. లేదంటే తాను ఓడిపోతూ వైసీపీని కూడా ఓడిస్తారో చూడాలంటూ స్థానికంగా మాట్లాడుకుంటున్నారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు ఓడిపోయినా పట్టువీడకుండా మళ్లీ పోటీకి రెడీ అయ్యారు సునీల్. వరుసగా మూడు సార్లు మూడు పార్టీల నుంచి అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆయన నాలుగోసారి కూడా ఎన్నికల బరిలో దిగుతున్నారు.
కొద్ది రోజుల క్రితం కాకినాడ పార్లమెంటు నియోజక వర్గానికి అభ్యర్ధిగా చలమలశెట్టి సునీల్ పేరు ఖరారు చేసింది.
చలమలశెట్టి సునీల్ 2009 నుంచి వరుసగా అదృష్టాన్ని పరీక్షించు కుంటూనే ఉన్నారు. అయినా ప్రతిసారి ఓటమి మాత్రం తప్పడం లేదు.
మూడు సార్లు ఓడిపోయినా పట్టు వీడకుండా అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. బలమైన సామాజిక వర్గం కావడంతో పాటు పుష్కలమైన ఆర్ధిక వనరులు ఉండటంతో ఆయనకు ఏదొక పార్టీ నుంచి అభ్యర్ధిత్వం లభిస్తోంది.
ప్రస్తుతం అధికార పార్టీ అగ్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో కాకినాడ లోక్‌సభ స్థానానికి సునీల్ అభ్యర్ధిత్వం ఖరారైంది.
చలమలశెట్టి సునీల్ కుటుంబానికి చెందిన ప్రముఖ గ్రీన్కో ఎనర్జీ సంస్థ ఏపీలో పలు ప్రాజెక్టులు చేపట్టింది.
దీంతో 2024 ఎన్నికల్లో ఆయన అభ్యర్ధిత్వం ఖరారైంది. 2014లో కూడా ఆయన వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.
2009 నుంచి చలమలశెట్టి సునీల్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున తొలిసారి కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు.
అప్పటి ఎన్నికల్లో మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ అభ్యర్ధి ఎం.ఎం.పళ్లంరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. సునీల్‌పై పళ్లంరాజు 34వేల ఆధిక్యాన్ని సాధించారు.
2014లో వైసీపీ తరపున కాకినాడ పార్లమెంటు నియోజక వర్గంలో పోటీ చేసిన సునీల్ టీడీపీ అభ్యర్ధి తోట నరసింహం చేతిలో ఓడిపోయారు.
2014లో కేవం 3431ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో టీడీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన సునీల్ వైసీపీ తరపున పోటీ చేసిన వంగా గీత చేతిలో ఓడిపోయారు.
సునీల్‌పై వంగా గీత 25వేల ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.
ముచ్చటగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ నాలుగోసారి తన అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నాల్లో పడ్డారు.
ఈసారి మళ్లీ వైసీపీ గూటికి చేరారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంటులో అడుగు పెట్టాలని కంకణం కట్టుకున్నారు.
2009 నుంచి సునీల్ పోటీ చేసిన ప్రతిసారి ఓటమి పాలయ్యారు. దాంతో పాటు ఆయన పోటీ చేసిన పార్టీ కూడా అధికారానికి దూరం అయ్యింది. తొలిసారి పోటీ చేసిన ప్రజారాజ్యం అధికారానికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యింది. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఈ సారి వైసీపీ తరపున సునీల్ బరిలో దిగనుండటంతో ఏమి జరుగనుందో ఆసక్తికరంగా మారింది. పాత పరాజయాలకు భిన్నంగా ఆయన విజయం సాధిస్తారా, గత ఆనవాయితీలు కొనసాగిస్తారా అనేది చర్చగా మారింది.