విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతాలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడైనా ఏదైనా జరిగినంతనే ఇట్టే స్పందించినట్లుగా కనిపించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారా? గతంతో పోలిస్తే ఆయనలో చురుకుదనం తగ్గిందా? సొంత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో.. కేంద్ర మంత్రి కుమార్తె ఒకరు సెక్యురిటీతో వెళ్లిన సందర్భంగా పోకిరీ లు వేధింపులకు గురి చేయటం ఏమిటి? అన్నది సంచలనంగా మారింది.
మహారాష్ట్రలో శాంతిభద్రతలపై కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్న రక్షా ఖడ్సే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా తమ ప్రాంతంలో నిర్వహించే సంత్ ముక్తాయ్ యాత్ర కోసం తన స్నేహితులతో కలిసి తన కుమార్తె వెళ్లిందన్నారు. సెక్యూరిటీ సాయంతో తన కూతుర్ని పంపగా.. కొందరు యువకులు వారిని వెంబడించి వేధించారని.. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైనా దురుసుగా వ్యవహరించారన్నారు.
ఆ సమయంలో తాను గుజరాత్ పర్యటనలో ఉన్నానని.. ఇంటికి తిరిగి వచ్చినంతనే తన కుమార్తె జరిగింది చెప్పిందన్నారు. ఒక కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సాధారణ మహిళల పరిస్థితేంటి? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై తాము పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసినట్లుగా చెప్పారు. ఈ అంశంపై రక్షా ఖడ్సే మామ.. మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే చెప్పిన విషయాలు మరింత దారుణంగా ఉన్నాయి. గతంలోనూ ఈ యువకుల మీద పోలీసులకు కంప్లైంట్లు వచ్చాయని.. వారు కరుడుగట్టిన నేరస్థులుగా పేర్కొన్నారు.
మహారాష్ట్రలో మహిళల మీద నేరాలు పెరుగుతున్నాయని.. నేరస్థులు పోలీసులకు భయపటం లేదన్నారు. బాధిత అమ్మాయిలు వారి మీద కంప్లైంట్లు ఇవ్వటానికి ముందుకు రావటం లేదని.. వారి తల్లిదండ్రులు సైతం తమ అమ్మాయిల పేర్లు బయటకు రాకూడదని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. తమకు మరో ప్రత్యామ్నాయం లేకనే ఫిర్యాదు చేశామన్నారు. పోలీసు స్టేషన్ కు వెళితే తమను రెండు గంటలు కూర్చోబెట్టారని.. ఆడపిల్లల విషయం కదా.. మరోసారి ఆలోచించుకోవాలని పోలీసులు తమకు సలహా ఇచ్చారన్నారు.
ఈ యువకులు పోలీసుల మీద కూడా దాడులు చేసిన సందర్భాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. వీళ్లకు రాజకీయ నాయకుల అండ ఉందని.. ఇదే విషయం మీద డీఎస్పీ.. ఐజీతోనూ మాట్లాడానని చెప్పారు. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇధిలా ఉండతా.. ఈ అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీన్ స్పందించారు. నిందితులు ఒక రాజకీయ పార్టీకి చెందిన వారని.. వారిలో కొందరిని తాము అరెస్టు చేశామన్నారు.
వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పిన మాటలు బాగానే ఉన్నప్పటికి.. ఒక కేంద్ర మంత్రి కుమార్తెను వేధింపులకు గురి చేసిన నిందితుల్లో కొందరిని మాత్రమే అదుపులోకి తీసుకోవటం దేనికి నిదర్శనం? దేశంలో ఇలాంటి పరిస్థితి మోడీ వరకు వెళుతున్నాయా? ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న ఇంట్లోని ఆడపిల్లలకే భద్రత లేకపోవటం దేనికి నిదర్శనం?