ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని ఠక్కున అడిగితే సగటు ఆంధ్రుడు వెంటనే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని ఉండాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సంకల్పించి..అమరావతికి శ్రీకారం చుట్టారు. అయితే, జగన్ సీఎం అయిన తర్వాత మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారు. పోనీ ఆ ఆటైనా పూర్తిగా ఆడకుండా…అధికార వికేంద్రీకరణ బిల్లును వెనక్కు తీసుకొని ఆటలో మిడిల్ డ్రాప్ అయ్యారు. దీంతో, రాజధాని ఏదో చెప్పలేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. ఏపీ రాజధానేదో చెబితే అక్కడ తమ కార్యాలయం పెట్టుకుంటామంటూ ఆర్బీఐ అధికారులు కోరుతున్నారంటే మన రాష్ట్ర దుస్థితి ఏమిటో అర్థమవుతోంది.
ఈ క్రమంలోనే రాజ్యసభ సాక్షిగా ఏపీ రాజధాని ఏమిటన్న అంశంపై క్లారిటీ వచ్చింది. అమరావతే ఏపీ రాజధాని అంటూ సాక్ష్యాత్తూ కేంద్ర మంత్రి నిండు సభలో వెల్లడించారు. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది..? రాజధానిని నిర్ణయించే అధికారం ఎవరిది..?’ అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావవు కోరారు. ఆ విషయంపైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ స్పందించారు. తనకున్న సమాచారం ప్రకారం అమరావతే ఏపీ రాజధాని అని రాయ్ పేర్కొన్నారు. ఇక, రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. గతంలో మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వెల్లడించారు.
అయితే, ఇటీవల ఆ బిల్లును ప్రభుత్వమే వెనక్కు తీసుకుందని, లోపాలను సవరించుకొని మరోసారి బిల్లు ప్రవేశపెడతామని వెల్లడించినట్లు తమకు సమాచారముందని సభలో వెల్లడించారు. తాజాగా రాయ్ చేసిన కామెంట్లు చూస్తుంటే ఏపీకి అమరావతే రాజధానిగా ఫిక్స్ చేయాలని కేంద్రం కూడా డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఇటీవల తిరుపతిలో అమిత్ షా పర్యటన తర్వాత అమరావతి రైతుల ఉద్యమానికి, న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకు బీజేపీ నేతలు మద్దతిస్తున్నారు. ఇక, తాజాగా రాయ్ వ్యాఖ్యలను బట్టి అమరావతిపై ఆశలు మళ్లీ చిగురించాయని అంతా భావిస్తున్నారు.