ఆత్మకూరులో మసీదు నిర్మాణం వ్యవహారంలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ వర్గానికి చెందిన నిరసనకారులు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పై దాడి చేయగా…ఆ ఘటనలో ముగ్గురు పోలీసుల సహా మొత్తం 15 మందికి గాయాలయ్యాయి. ఈ దాడి వెనుక ఎస్డీఎఫ్ అతివాద సంస్థ సభ్యులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డితో పాటు మొత్తం 60 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే కడప జైలులో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని బీజేపీ కేంద్ర మంత్రి మురళీధరన్ పరామర్శించారు. ఆ తర్వాత జగన్ పై మురళీధరన్ నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం అటువంటి దాడులను ప్రోత్సహిస్తూ పోలీసుల విధులకు అడ్డుపడుతోందని ఆయన ఆరోపించారు. శ్రీకాంత్ రెడ్డిపై కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాంత్ రెడ్డిని చంపేందుకు ఆత్మకూరులో కుట్రపన్నారని ఆరోపించారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని వదిలేసి, వాటిని అడ్డుకోబోయిన శ్రీకాంత్రెడ్డిని అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు.
ఏపీలో ముస్లిం ఫండమెంటల్ కార్యకలాపాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. జగన్ నిత్యం అల్లర్లును ప్రోత్సహిస్తూ.. సీఎం స్థాయి బాధ్యతలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఏపీలో శాంతిభద్రతలు సన్నగిల్లాయని, రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయనే అనుమానం కలుగుతోందని షాకింగ్ కామెంట్లు చేశారు. బీజేపీ నేతలను ఆత్మకూరుకు పంపాలని, అల్లర్లు జరిగినప్పటి నుంచి బీజేపీ నేతలను అక్కడికి పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనపై జగన్ ఫోకస్ చేయకపోవడంతోనే వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారని, అల్లర్లను ప్రోత్సహిస్తున్నారని, వాటికి జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.