గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తమదే నని బీజేపీ రాష్ట్ర చీఫ్, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి నొక్కి చెప్పారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బీజేపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్-కాంగ్రెస్ పార్టీలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు దాసోహం చేసేందుకు రెడీ అయ్యాయని ఆయన ఆరోపించారు. బీఆర్ ఎస్, కాంగ్రెస్‌లు కూడా.. ఒకే తాను ముక్కలని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక, సంఖ్యాపరంగా చూస్తే.. బీజేపీకి కార్పొరేషన్లో కార్పొరేటర్ల సంఖ్యతోపాటు… ఎక్స్ అఫిషియో సభ్యుల సంఖ్య కూడా తక్కువే. అయినప్పటికీ.. బీజేపీ పోటీ చేయడానికి కారణం.. ఇతర సభ్యులు సైతం.. తమతో ఉంటారని నమ్ముతున్నట్టు కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. అభివృద్ధిని కాంక్షిచే వారు బీజేపీ తోనే ఉంటారని అన్నారు. ఎంఐఎం కోసమే బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ నుంచి తప్పుకొన్నాయని ఆరోపించారు. అధికార పార్టీలతో అంటకాగి.. నగరాన్ని దోచుకునే సంస్కృతికి ఎంఐఎం అలవాటు పడిందన్నారు.
ఎంఐఎం అంటే.. సాధారణ ప్రజల్లో భయం నెలకొందని కిషన్ రెడ్డి అన్నారు. అందుకే.. ఆ పార్టీ సభ్యుడిని ఓడించాలని కార్పొరేటర్లకు వినతులు అందుతున్నట్టుగా తమకు సమాచారం అందిందన్నారు. ప్రస్తుతం ఎంఐఎం పరిస్థితి కూడా దారుణంగానే ఉందని.. ప్రజలు ఆ పార్టీ వైపు లేరని వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీఆర్ ఎస్, కాంగ్రెస్‌లు మద్దతు ఇచ్చినప్పటికీ.. తమ అభ్యర్థి గౌతం విజయం దక్కించుకుంటారని.. చివరి నిముషంలో ఏమైనా జరిగొచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం అన్నీ చేసిందన్నారు. హైదరాబాద్ పేరు ఇప్పుడు ప్రపంచ స్థా యికి వినిపిస్తోందంటే.. మోడీనే కారణమన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్‌ను ఇక్కడే ఉత్పత్తి చేసేలా అనుమతి ఇచ్చారని ఆయన తెలిపారు. అందుకే.. మోడీ అంటే.. ఇక్కడివారికి ఎనలేని భక్తి అని కిషన్ రె డ్డి పేర్కొన్నారు. అందుకే.. కార్పొరేటర్లు కూడా.. ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేసే ముందు.. ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని ఓటేయాలని ఆయన సూచించారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. గెలుపు గౌతం రావుదేనని చెప్పారు.