పార్టీ మారిన వాళ్లు రాజకీయ వ్యభిచారులు అని, సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. పార్టీ మారిన వారు వ్యభిచారులైతే నీ అయ్యది ముందు ఏ పార్టీనో చెప్పాలి అని కేటీఆర్ ను బండి సంజయ్ డిమాండ్ చేసిన వైనం షాకింగ్ గా మారింది. పార్టీ మారిన వారు వ్యభిచారం చేసినట్లే అని కేటీఆర్ అంటున్నారని, అటువంటప్పుడు కేసీఆర్ ను ఏ పేరుతో పిలవాలో కూడా కేటీఆర్ చెప్పాలని బండి సంజయ్ చురకలంటించారు.
నువ్వు కొట్టినట్టు నటించు నేను ఏడ్చినట్టు నటిస్తా అన్న రీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కేటీఆర్, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు వచ్చి డ్రగ్స్ కు సంబంధంలేదని ప్రమాణం చేయగలరా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఏది పడితే అది మాట్లాడేందుకు తమకు సంస్కారం అడ్డొస్తుందని, ఎవరి భాష ఎలా ఉంది, ఎవరి సంస్కారం ఏంటి అనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ నోటీసులకు నోటీసులతోనే సమాధానం చెబుతామని, కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తానని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు తప్పవని, అయితే హద్దు మీరొద్దు అని కేటీఆర్ కు బండి సంజయ్ హితవు పలికారు.
ఇక, మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ అని బండి సంజయ్ ఆరోపించారు. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కోసమే ఈ డ్రామాలాడుతున్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. మూసీ నదిని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, ఆ నది వ్యవహారంపై రేవంత్ రెడ్డి కే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక ఆ టాపిక్ ను డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ ప్రక్షాళన అంటూ కాంగ్రెస్ పార్టీ డ్రామాలాడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ డ్రామా కంపెనీ అని, ఎవరికి వారే ఆ పార్టీలో ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. మూసీ నదిపై ముఖ్యమంత్రి పూటకో మాట మాట్లాడుతున్నారని చురకలంటించారు.
సబర్మతి నది ప్రక్షాళనకు 7000 కోట్ల రూపాయలు ఖర్చయిందని, నమామీ గంగ ప్రాజెక్టు కోసం 40 వేల కోట్లు ఖర్చయిందని, కానీ మూసీ నది ప్రక్షాళనకు మాత్రం లక్షన్నర కోట్లా అని ప్రశ్నించారు. ఒక కిలోమీటర్ కు 2000 కోట్ల చొప్పున ఇంతకన్నా ఖరీదైన ప్రాజెక్టు ప్రపంచంలో ఉండబోదని, అదేవిధంగా ఇంతకన్నా పెద్ద స్కాం కూడా ఉండబోదని చెప్పుకొచ్చారు.