ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఏపీలో పంచాయతీ ఎన్నికలు రద్దు చేయాలంటూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టి వేసింది. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల తీరును కూడా సుప్రీం తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం సెక్రటరీకి ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలోని కొన్ని ఉద్యోగ సంఘాలు సుముఖంగా లేవని, కాబట్టి ఎన్నికల విధులకు కేంద్ర సిబ్బందిని కేటాయించాలని నిమ్మగడ్డ కోరారు. ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని నిమ్మగడ్డ లేఖలో వివరించారు.
అంతకుముందు, విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఏపీలో రాజ్యాంగబద్ధమైన విధులకు ఆటంకం కలుగుతోందని సుప్రీం, ఎన్నికల సంఘం తన పని తాను చేసుకునే వాతావరణం కల్పించాలని సుప్రీం అభిప్రాయపడింది. ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని, రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు ఏం చేయాలో కోర్టు చెప్పాల్సిన అవసరం లేదని జస్టిస్ కౌల్ ధర్మాసనం అభిప్రాయపడింది. కరోనా తీవ్రంగా ఉన్న కేరళలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, పశ్చిమబెంగాల్ లో ఎన్నికలు నిర్వహించాలని తామే ఆదేశాలిచ్చామని, అటువంటిది ఏపీలో ఎన్నికలు వద్దని తాము ఎలా చెబుతామని జస్టిస్ కౌల్ ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఉద్యోగులు సహకరించకుంటే కేంద్ర సిబ్బందితో అయినా సరే ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీలోని కొన్ని ఉద్యోగ సంఘాలు, జగన్ సర్కార్ స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.