కేంద్రం లోని ప్రధాని నరేంద్ర మోడీ కూటమి సర్కారులో టీడీపీ భాగంగా ఉన్నప్పటికీ.. కేంద్రం మాత్రం తన వైఖరిని మార్చుకోలే దు. అమరావతికి సంబంధించిన నిధుల విషయంలో తాజాగా మరోసారి తొండి నే ప్రదర్శించింది. ఈ ఏడాది ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతికి రూ.15,000 కోట్ల మొత్తాన్ని ఆర్థిక సంస్థలతో ఇప్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గొప్పగా ప్రకటించారు. అంతేకాదు.. చెప్పిందే రెండు మూడు సార్లు చెప్పి.. పార్లమెంటులో చప్పట్లు కూడా కొట్టించుకున్నారు.
అయితే.. తర్వాత. ఇది అప్పా.. లేక కేంద్రం ఇస్తున్న గ్రాంటా(తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు) అని పదే పదే ప్రశ్నించినప్పుడు.. అప్పుగా ఇప్పిస్తున్నామని, ప్రపంచ బ్యాంకు నుంచి దీనిని తీసుకుంటున్నా మని నిర్మలమ్మ చెప్పుకొచ్చారు. సరే.. ఏదో ఒక రూపంలో నిధులు వస్తున్నాయని.. సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత.. ఈ అప్పుగా తీసుకు నే రూ.15,000 సొమ్మును ఎవరు చెల్లించాలని ప్రశ్నించినప్పుడు.. `ఎవరో ఒకరం తీరుస్తాం. దీనిలో మీకు బాధెందుకు?` అని ఎదురు ప్రశ్నించారు.
కట్ చేస్తే.. ఇప్పుడు అసలు వాస్తవం బయటకు వచ్చింది. అది కూడా చాలా సైలెంట్‌గా సర్కారుకు లిఖిత రూపంలో సమాచారం ఇచ్చారు. “ప్రపంచ బ్యాంకు, ఏడీబీ(ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు) నుంచి రూ.15000 కోట్లు మీకు ఇస్తున్నారు. అయితే.. ఇది వాయిదాల పద్ధతిలో.. అమరావతి నిర్మాణాల పురోగతి చూసి ఇస్తారు.“ అని తొలి కాలమ్‌లో పేర్కొన్నారు. తర్వాత.. ఈ మొత్తం ఎమౌంటులో 9.3 శాతం నిధులను కేంద్రం భరిస్తుంది! అని చావు కబురు చల్లగా చెప్పారు.
అంటే.. మొత్తం అమరావతికి కేంద్రం ఇప్పిస్తున్న అప్పు 15000 కోట్లలో కేంద్రం 9.3 శాతానికి మాత్రమే బాధ్యత తీసుకుంటుంది. ఇది.. మొత్తం అప్పులో రూ.1400 కోట్లు మాత్రమే. మిగిలిన 13600 కోట్లను కూడా చంద్రబాబు సర్కారు తీర్చాల్సి వుంటుంది. దీనికి 50 ఏళ్ల సమయం పెడుతున్నట్టు చెప్పారు. కట్ చేస్తే.. ఇక్కడ కూడా ఏదో ఒక రూపంలో అందింది కదా.. ఏడుపు ఎందుకు? అని బీజేపీ నాయకులు అనొచ్చు. కానీ, అసలు మతలబు ఇక్కడే ఉంది.
ప్రపంచ బ్యాంకు ఇస్తున్న సొమ్మును .. డాలర్ల రూపంలో ఇస్తోంది. అంటే.. 1.6 బిలియన్ డాలర్లు ఇస్తోంది. దీనిని ఏపీ ప్రభుత్వం కూడా డాలర్ల రూపంలోనే చెల్లించాలి. ఇండియన్ కరెన్సీలో చెల్లిస్తానంటే కుదర దని షరతు విధించారు. సరే.. దీనిలో తప్పేంటి? అంటారా? ప్రస్తుతం డాలరుతో రూపాయి మారకం విలువ రూ.84గా ఉంది. కానీ, రోజు రోజుకు డాలర్ విలువ పెరుగుతుండడం.. రూపాయి క్షీణిస్తున్న క్రమంలో అప్పు తిరిగి చెల్లించడం ప్రారంభమయ్యే సమయానికి(ఓ ఐదేళ్ల తర్వాత) డాలరు విలువ రూ.125 వరకు ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అప్పుడు సర్కారుకు భారం తడిసి మోపెడు అవుతుంది. ఈ విషయంలో మోడీ సర్కారు ఏమీ చేయలేదు. అంతా బాబు భరించాల్సిందే!! ఇదీ.. మోడీ చేసిన సాయం-డబుల్ ఇంజన్ సర్కారు చేస్తున్న మేలు!!