అదే పనిగా అప్పులు చేసుకుంటూ వెళ్తున్న ఆంధ్రాను కేంద్రం హెచ్చరించింది. అస్సలు క్రమశిక్షణ అన్నది లేకుండా ఆర్థిక వ్యవస్థను నడపడం భావ్యం కాదని, లంకను చూసి నేర్చుకోవాలని హితవు చెప్పింది. నిన్నటి వేళ దేశ రాజధానిలో అఖిలపక్ష సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ కేంద్రం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఉచిత పథకాల కారణంగానే రాష్ట్రాలలో ఆర్థిక గణాంకాలు గతి తప్పుతున్నాయని మథనపడింది.
తాము ఉన్నవే చెప్పామని చెబుతూ, ఆంధ్రాతో సహా తొమ్మిది రాష్ట్రాలలో ఆర్థిక స్థితిగతులన్నీ ఘోరంగా ఉన్నాయని నెత్తీనోరూ మొత్తుకుంది. కేంద్రం చెబుతున్న జాబితాలో ఆంధ్రప్రదేశ్,బిహార్, హరియాణా, ఝార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఉన్నాయి. వీటిలో పంజాబ్ లో ఆప్ సర్కారు నడుస్తోంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కారు నడుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ సర్కారు నడుస్తోంది.
కేరళలో ప్రభుత్వాన్ని వామపక్షాలు నడుపుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ను మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి) ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్నారు. బిహార్ ను నితీశ్ కుమార్ (జనతాదళ్ యూ నేత) ఏలుతున్నారు. మధ్యప్రదేశ్ ను బీజేపీ ఏలుబడి చేస్తోంది. హరియాణా బీజేపీ ఏలుతోంది. ఝార్ఖండ్ ను ఆ ప్రాంత ముక్తి మోర్చా నేత ఏలుతున్నారు. వీటన్నింటిలోనూ ఆర్థిక క్రమశిక్షణ లేనే లేదని తేలిపోయింది.
తాము ఉన్నదే చెప్పామని వాస్తవాలు గుర్తించి నడుచుకోవాలని లేదంటే సంక్షోభంలోకి వెళ్లిపోవడం ఖాయమని కేంద్రం తేల్చేసింది. శ్రీలంకలాంటి పరిస్థితులు ఇక్కడ ఉంటాయని కాదు కానీ మనకు ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం అంటూ కేంద్ర మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. అంటే ఏడాదికి 56 వేల కోట్ల రూపాయలను పంచుతున్న రాష్ట్రప్రభుత్వానికి అదేవిధంగా ఇప్పటిదాకా సంక్షేమం పేరిట లక్షా 37 వేల కోట్ల రూపాయలు పంచిన లేదా పంచామని చెబుతున్న ఏపీ సర్కారుకు నిజంగానే ఇది ఒక ఝలక్ !
ఇప్పటిదాకా బకాయిలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు రుణాల రూపేణా ఉన్నాయి. కేంద్రం పరిధిలో గ్యారంటీ ఉంటూ తెచ్చుకున్న అప్పులు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 34 వేల కోట్లకు పైగా ఉన్నాయి. ఇన్ని అప్పులు ఉన్నా కూడా ఏపీ సర్కారు పెద్దలు తమని తాము సమర్థించుకోవడం ఏం బాలేదని విపక్షం అంటోంది.