ఒక రోజు అటో ఇటో కానీ.. తాను ఎజెండాగా పెట్టుకున్న అంశాల్ని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్న మోడీ.. తాజాగా జమిలి ఎన్నికలకు రైట్..రైట్ అనేశారు. తాజాగా సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తాజాగా జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికలు అంటే.. దేశ వ్యాప్తంగా అసెంబ్లీ.. లోక్ సభ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం.
ఇప్పటివరకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఎన్నికల్ని నిర్వహించటం.. లోక్ సభ ఎన్నికల్నిఒకేసారి నిర్వహించటం చేస్తున్నారు. ఒకే టైంలో ఎన్నికలకు అర్హమయ్యే రాష్ట్రాల్ని కలిపి అసెంబ్లీ ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు. దీంతో.. కాస్త అటు ఇటుగా ప్రతిఆర్నెల్లకు లేదంటే ఏడాదికి ఏదో ఎన్నికల హడావుడి రావటం.. కేంద్ర ప్రభుత్వంపై కొత్త ఒత్తిళ్లు పడుతున్న పరిస్థితి.
ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తే.. పాలనా పరమైన సమస్యలు.. అధిక ఖర్చును నిరోధించటంతో పాటు.. ఒకే ప్యాట్రన్ లో ఎన్నికలు రావటం వల్ల ప్రభుత్వాలు రాజకీయంగా ప్రభావితం కావన్న అభిప్రాయం ఉంది. జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను తాజాగా కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది.
దీంతో.. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు.. హైకోర్టు న్యాయమూర్తులతో సహా 32 పార్టీలు, ప్రముఖ న్యాయన్యామూర్తులు దీన్ని సమర్థించటం తెలిసిందే. 18వ రాజ్యాంగ సవరణలను ప్యానల్ సిఫార్సు చేసింది. ఒకే దేశం ఒకే ఎన్నికల విధానాన్ని అమలు చేయటం ద్వారా ఎన్నికల ప్రక్రియ సులువు కావటంతో పాటు.. వేగవంతమైన ఆర్థిక వ్రద్ధికి దారి తీస్తుందని ప్యానల్ పేర్కొంది.
లోక్ సభ.. రాష్ట్ర అసెంబ్లీలతోపాటు పంచాయితీలకు మూడు స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించటం వల్ల వలస కార్మికులు పలుమార్లు ఓటేయటం కోసం సెలవులపై తమ ప్రాంతాలకు వెళ్లి వస్తున్నారని.. దీని వల్ల ఉత్పత్తిలో అంతరాయం కలుగుతుందన్న వాదన బలంగా ఉంది. ఇలాంటి చికాకులకు జమిలి ఎన్నికలే చక్కటి ఔషధంగా పేర్కొంటున్నారు. మొత్తంగా జమిలి ఎన్నికలపై మొదట్నించి సానుకూలంగా ఉన్న మోడీ సర్కారు.. తాను అనుకున్నట్లే ఈ అంశాన్ని పూర్తి చేస్తుందనే చెప్పాలి.