కొద్ది నెలల క్రితం జరిగిన ప్లీనరీ సమావేశాలలో వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను ఆ పార్టీ నేతలు ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అయితే, అలాంటి తీర్మానం ఎప్పుడూ చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘానికి స్వయంగా వైసీపీనే తెలిపిందట. తాజాగా ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. వైసీపీకి జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదని మరోమారు సీఈసీ స్పష్టం చేసింది. వైసీపీకి జగన్ శాశ్వత అధ్యక్షుడు అవునో కాదో చెప్పాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు రాసిన లేఖకు బదులుగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ వ్యాఖ్యలు చేసింది.
రఘురామకు ఈ వివరాలు తెలియజేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం లిఖితపూర్వక జవాబు ఇచ్చింది. తమ పార్టీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా గాని వైయస్సార్సీపీగా గాని మార్చే ప్రతిపాదన, ఆలోచన తమకు లేవని ఆ పార్టీ వివరించిందని కూడా సీఈసీ స్పష్టం చేసింది. వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను ఎన్నుకున్నట్టుగా పత్రికల్లో ప్రకటన వచ్చిందని, ఆ విషయంపై క్లారిటీ ఇవ్వాలని కోరుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఎన్నికల సంఘానికి రఘురామ లేఖ రాశారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చింది.
మరోవైపు, చాలా నియోజకవర్గాలలో దొంగ ఓట్ల నమోదు, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందదని రఘురామ ఆరోపించారు. ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా అంగీకరించారని వెల్లడించారు.