మునుగోడు ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి మరింత రాజుకుంటోంది. ఫామ్ హౌస్ బేరసారాల వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. మునుగోడులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై సీఈసీ స్పందించింది. రాజగోపాల్ రెడ్డికి చెందిన సంస్థ నుంచి భారీ మొత్తం నగదు స్థానిక వ్యాపారులు, వ్యక్తులకు చెందిన ఖాతాలకు మళ్ళించారని ఆరోపణలు వచ్చాయి.
దాదాపు 22 ఖాతాలకు 5 కోట్ల రూపాయలు మళ్లించారని, ఈ డబ్బంతా ఓటర్లకు పంచేందుకే అని సీఈసీకి టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో, ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం…. రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ ఫిర్యాదులోని అన్ని అంశాలపై సోమవారం సాయంత్రం నాలుగు గంటల్లోపు సమాధానం చెప్పాలని సిఇసి ఆదేశించింది. ఎన్నికల సమయంలో ఇంత భారీ మొత్తంలో నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం అని టిఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.
రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీ బ్యాంక్ ఖాతా నుంచి అక్టోబర్ 14, 18, 29 తేదీలలో ఈ నగదు బదిలీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ డబ్బును ఆయా వ్యక్తులు విత్ డ్రా చేసి ఓటరు ఓటర్లకు పంచారని టీఆర్ఎస్ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను రాజగోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్తన్ రెడ్డి కొట్టిపారేశారు. ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.