ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని హైదరాబాద్ మహానగరం అధిగమించిందా? ఇతర మహానగరాలకు భిన్నంగా హైదరాబాదీయులు కరోనాను తట్టుకునేలా యాంటీబాడీల్ని పెంచుకున్నారా? ఈ మహానగరంలోని ప్రతి ఇద్దరిలో ఒకరి కంటే ఎక్కువమందికి కరోనా వచ్చి పోయిన విషయం కూడా తెలీదా? కరోనాను తట్టుకునే దిశగా మహానగరం తయారైందా? పురుషల కంటే మహిళల్లోనే అధికంగా యాంటీబాడీలు ఉన్నాయా? 75 శాతం మందికి అసలు కరోనా వచ్చినట్లే తెలీదా? ఇంట్లో ఒకరికి వస్తే కుటుంబ సభ్యుల్లో యాంటీబాడీలు వచ్చేశాయా? లాంటి ప్రశ్నలకు అవుననే సమాధానాన్ని చెబుతోంది సీసీఎండీ.. ఎన్ఐఎన్.. భారత్ బయోటెక్ అధ్యయనం స్పష్టం చేస్తుంది.
హైదరాబాద్ మహానగరం హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా దూసుకెళుతుందన్న విషయాన్ని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. నగరంలోని 54 శాతం మంది ప్రజల శరీరాల్లో కరోనాపై పోరాడే యాంటీబాడీస్ ఉన్నట్లుగా సీరో సర్వే వెల్లడించింది.
వైరస్ బారిన పడుతున్న వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువన్న విషయం తాజా అధ్యయనం వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న మహిళల్లో 56 శాతం మందిలో వైరస్ కు యాంటీబాడీలు కనిపించగా.. 53 శాతం మంది పురుషుల్లో మాత్రమే యాంటీబాడీస్ ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది.
నివేదిక వెల్లడించిన మరిన్ని వివరాలు ఏమంటే..
- హైదరాబాద్ ప్రజల్లో 75 శాతం మందికి కరోనా సోకిన విషయం అసలు తెలీనే తెలీదు.
- ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 18 శాతం మందికి కరోనా పాజిటివ్ అయ్యారు. వారిలో 90 శాతం మందిలో ఇంకా యాంటీబాడీస్ రక్షణ ఉంది.
- చాలా వార్డుల్లో 50-60శాతం మందిలో యాంటీ బాడీస్ కనిపించాయి. కొన్ని వార్డుల్లో అత్యధికంగా 70 శాతం.. కనిష్ఠంగా 30 శాతం కనిపించాయి.
- 70 ఏళ్లకు పైబడిన వారిలో 49 శాతం మందికి మాత్రమే కరోనా సోకింది. ఇంటికే పరిమితం కావటం.. తగు జాగ్రత్తలే పెద్ద వయస్కులు తక్కువగా కరోనా బారిన పడ్డారు.
- కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా వస్తే ఆ కుటుంబాల్లో 78 శాతం మందిలో యాంటీ బాడీలు కనిపించాయి. బయట వ్యక్తులు.. సమూహాల నుంచి 68 శాతం మందికి కరోనా సోకింది.
- దేశ రాజధాని ఢిల్లీలో 56 శాతం మంది ఇప్పటికే కరోనా యాంటీ బాడీస్ ఉన్నట్లుగా ఇటీవల అధ్యయనం వెల్లడించింది. ఈ లెక్కన చూస్తే.. దేశ రాజధాని కంటే కూడా హైదరాబాద్ నగర ప్రజల్లోనే యాంటీబాడీస్ అధికమని చెప్పాలి.