వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో వాడీవేడి వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు అవినాష్ తరపు లాయర్లు, వైఎస్ సునీత తరఫు వాదనలు విన్న న్యాయస్థానం రేపు సీబీఐ తరఫు న్యాయవాదుల వాదనలు విననుంది. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో సీబీఐ అనుబంధ కౌంటర్ దాఖలు చేసింది.
ఆ కౌంటర్ లో అవినాశ్ రెడ్డికి సంబంధించిన కీలక అంశాలను పొందుపరిచింది. వివేకా మృతి విషయం సీఎం జగన్ కు ఉదయం 6.15 గంటలకు ముందే తెలిసిందని, వివేకా పీఏ కృష్ణారెడ్డి చెప్పకముందే వివేకా మృతి విషయం జగన్ కు తెలుసని సీబీఐ అధికారులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. వివేకా మృతి గురించి జగన్ కు అవినాశ్ రెడ్డే చెప్పారా అన్నది దర్యాప్తు చేయాల్సి ఉందని తెలిపారు. అవినాష్ ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది.
సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి సహకరించడం లేదని, వివేకా హత్య వెనుక భారీ కుట్రను వెల్లడించేందుకు అవినాష్ ముందుకు రావడం లేదని సీబీఐ తన కౌంటర్ లో ఆరోపించింది. హత్య జరిగిన రాత్రి 12.27 గంటల నుంచి 1.10 గంటల వరకు అవినాష్ వాట్సాప్ కాల్ మాట్లాడారని వెల్లడించింది. విచారణకు రావాలని నోటీసులు ఇస్తే 4 రోజుల సమయం కావాలని, ఆ తర్వాత తల్లి అనారోగ్యం కారణంగా వారం రోజుల పాటు రానని మొత్తం రెండు వారాలు విచారణకు గైర్హాజరయ్యారని ఆరోపించింది..
అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఈ నెల 22న సీబీఐ బృందం కర్నూలు వెళ్లిందని, అక్కడ అవినాష్ అనుచరులను అక్కడ చూసిన తర్వాత శాంతిభద్రతల సమస్య రావొచ్చని అనిపించిందని చెప్పింది. జూన్ 30 లోగా వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉందని, అందుకే అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవొద్దని తన కౌంటర్ లో వివరించింది.