వైఎస్ వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు వరుసగా షాకులిస్తున్న సంగతి తెలిసిందే. వివేకా కేసులో ఇప్పటికే పలుమార్లు సీబీఐ అవినాష్ రెడ్డిని విచారణ జరిపింది. ప్రతి శనివారం విచారణకు హాజరు కావాలన్న షరతుతో అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఈ క్రమంలోనే తాజాగా అవినాస్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వివేకా కేసులో అవినాష్ ను 8న నిందితుడిగా సీబీఐ చేర్చింది.
ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయంపై చివరి ఛార్జిషీట్లో సీబీఐ పలు సంచలన అభియోగాలు నమోదు చేసింది. వివేకాను దారుణంగా చంపిన కేసులో అవినాష్ రెడ్డితోపాటు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలపై ఇటీవల సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటును కూడా సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోనుంది.
అవినాష్ రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చిన సీబీఐ…ఆగస్టు 14న కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఆరో, ఏడో నిందితులుగా భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న ఉదయ్ కుమార్ రెడ్డిని, 16న భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులోగా జైలులో ఉన్న నిందితులను పోలీసులు హాజరుపరిచారు. వారికి రిమాండ్ ను ఆగస్ట్ 14 వరకు పొడిగించింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై ఉండడంతో కోర్టుకు హాజరయ్యే బాధ్యతను సీబీఐకి కోర్టు అప్పగించింది.