సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ).. ఇటీవల కాలంలో మన రాష్ట్రంలోనే కాకుండా..దేశవ్యాప్తంగా కూడా చాలా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది! విశ్వసనీయతకు, విచారణలో దూకుడుకు ఈ సంస్థకు పెట్టింది పేరు. ప్రస్తుతం మన రాష్ట్రంలో రెండు కీలక కేసులను ఈ సంస్థ విచారిస్తోంది. ఒకటి వివేకానంద రెడ్డి హత్య, రెండు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులు.. ఇవి ఎందుకు ప్రస్తావించాల్సి వస్తోందంటే.. సీబీఐ విషయాన్ని చెప్పుకోవడం కోసమే. అయితే.. ఇంతటి పవర్ ఫుల్ సంస్థపైనా.. తీవ్ర అపవాదులు ఉన్నాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే.. గతంలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా ప్రచారం చేసేవారు.
ఎవరు అధికారంలో ఉన్నా..
అంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న వారు ఏం చెబితే.. దానినే సీబీఐ చేస్తుంది.. ఒకరకంగా.. అది కీలుబొమ్మ అని ప్రచారంలో ఉంది. ఇదే విషయాన్ని గతంలో యూపీఏ హయాంలో వెలుగు చూసిన కోల్ గేట్ కుభకోణం(బొగ్గు గనుల కేటాయింపు) సమయంలో దీనిని విచారించిన.. సీబీఐని సుప్రీం కోర్టు ఓ కామెంట్ చేసింది. పంజరంలో చిలుక అని వ్యాఖ్యానించింది. ఆ సమయంలో, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీని నియంత్రిస్తోందని ఆరోపించింది. అయితే.. ఇది కాంగ్రెస్‌తోనే పోలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ విషయంలోను.. గత కొన్నేళ్లుగా ఇదే మాట వినిపిస్తోంది.
ఈ విమర్శలు మామూలే!
అనేక మంది ప్రతిపక్ష నాయకులపై సీబీఐని ప్రయోగించడం, కేసులు పెట్టించడం.. అరెస్టులు చేయించడం వంటివి సాగడంతో.. సీబీఐని బీజేపీ డిమాండ్లు తీర్చే సంస్థగా విపక్షాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కేసు విచారణకు సంబంధించి.. సీబీఐపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐ పంజరంలో చిలుకగా ఉందని.. దీనిని నియంత్రిస్తున్నారని.. వ్యాఖ్యానించింది. సీబీఐకి స్వయంప్రతిపత్తి ఉండాలని నొక్కి చెప్పిన మద్రాస్ హైకోర్టు.. కేంద్ర ఎన్నికల కమిషన్, కాగ్ తరహాలో దానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని సూచించింది. ఈ క్రమంలోనే సీబీఐకి చట్టబద్దమైన హోదాను అందించే ప్రత్యేక చట్టాన్ని పరిగణలోకి తీసుకొని అమలు చేయాలని మోడీ ప్రభుత్వాన్ని కోరింది.
కోర్టు ఏమందంటే..
ప్రతిపక్షం ప్రకారం బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేతిలో రాజకీయ సాధనంగా మారిందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. సిబిఐకి కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ వలె స్వయంప్రతిపత్తి ఉండాలి. ఇది పార్లమెంటుకు మాత్రమే జవాబుదారీగా ఉండాలని పేర్కొంది. అప్పుడే ప్రజలకు సిబిఐపై విశ్వాసం పెరుగుతుందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇదీ కేసు..
తమిళనాడులో 300 కోట్ల రూపాయల పోంజీ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ ఎన్. కిరుబాకరన్ మరియు జస్టిస్ బి పుగలెండి తమ తీర్పులో సీబీఐపై సంచలన వ్యాఖ్యలుచేశారు. ఈసీ మాదిరిగా.. సీబీఐ కి స్వయం ప్రతిపత్తి ఉండాలని, సీబీఐ డైరెక్టర్‌కి ప్రభుత్వ కార్యదర్శిగా అధికారాలు ఇవ్వాలని, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ద్వారా నివేదించకుండా నేరుగా మంత్రి/ప్రధాన మంత్రికి నివేదించాలి అని తీర్పు పేర్కొంది. పోంజీ స్కామ్ కేసును మానవ శక్తి లేని కారణంగా బదిలీ చేయడాన్ని కేంద్రం వ్యతిరేకించినందుకు న్యాయమూర్తులు స్పందిస్తూ, నెల రోజుల వ్యవధిలో కేడర్ సమీక్ష మరియు సీబీఐ పునర్నిర్మాణం కోసం సమగ్ర ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించారు.
ఎఫ్ బీఐ తరహాలో..
సీబీఐని అమెరికాలో ఉన్న ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , బ్రిటన్‌లోని స్కాట్లాండ్ యార్డ్‌తో సమానం చేయవచ్చని న్యాయమూర్తులు చెప్పారు, దీనికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు జరపాలని ధర్మాసనం పేర్కొంది. దేశంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పనితీరుపై గతంలోనూ మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐ కేసుల్లో నేరారోపణ తక్కువగా ఉందని, అనేక కేసులలో శిక్ష రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థ విశ్వసనీయతను కోల్పోతున్నట్లుగా కనిపిస్తోందని మద్రాస్ హైకోర్టు గతంలోనే వ్యాఖ్యానించింది.
ప్రధాని పరిధిలో పని!
1941 లో ఏర్పడిన ఈ ఏజెన్సీ ప్రధాన మంత్రి కార్యాలయం పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కు నివేదిస్తుంది. దీని డైరెక్టర్ని ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి మరియు ప్రతిపక్ష నాయకుడితో కూడిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఎంపిక చేస్తుంది. ఇది స్వయం ప్రతిపత్తితో వ్యవహరించాల్సిన వ్యవస్థ. అయితే దీనికి అధికారాలు తక్కువగా ఉండటంతో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి లోబడి పని చేస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.