ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగిన ఈ హత్యోదంతం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, సీఎం జగన్ అయిన తర్వాత తన చిన్నాన్న మర్డర్ మిస్టరీ విచారణ మెరుపు వేగంతో జరుగుతందని అంతా ఆశించారు. కానీ, అనూహ్యంగా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కేసు విచారణ నత్తనడకన సాగుతోందని సాక్ష్యాత్తూ వివేకా కూతురు, జగన్ సోదరి వైఎస్ సునీత ఢిల్లీ సాక్షిగా పరోక్షంగా సంచలన ఆరోపణలు చేశారు.
ఆ తర్వాత ఈ కేసు విచారణ వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలోనే నెలన్నర పాటు పులివెందులల మకాం వేసిన సీబీఐ అధికారులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. ఈ కేసులు ప్రధాన అనుమానితుడిగా భావిస్తోన్న సునీల్ యాదవ్ ను కొద్ది రోజుల క్రితం సీబీఐ అధఇకారులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. ఈ క్రమంలోనే తాజాగా వివేకా మర్డర్ కేసు మలుపు తిరిగే వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
వివేకా మర్డర్ కు ఉపయోగించిన ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. అత్యంత రహస్యంగా ఆ ఆయుధాల కోసం అన్వేషణ సాగిందని, పులివెందులలోని సునీల్ యాదవ్, తోండూరులోని ఎర్రగంగిరెడ్డి, ప్రోద్దుటూరులోని సుబ్బారెడ్డి, సింహాద్రిపురంలోని ఉమాశంకర్ ఇళ్లలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు…సినీ ఫక్కీలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.
ఢిల్లీ నుంచి కడపకు వచ్చిన సీబీఐ అధికారుల బృందం ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 20 మంది రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల సాయంతో వీరు తమకు వచ్చిన పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించారని తెలుస్తోంది. అయితే, ఆయుధాలు ఎక్కడ పడవేశానో తనకు గుర్తు లేదని సునీల్ యాదవ్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో, పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి ఏకకాలంలో నలుగురి ఇళ్లలో ఆయుధాల కోసం సోదాలు నిర్వహించారని తెలుస్తోంది.
మరోవైపు, సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ కుమార్ యాదవ్ స్టేట్ మెంట్ ను కూడా సీబీఐ అధికారులు రికార్డు చేసినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా, మరి కొద్ది రోజుల్లో వివేకా మర్డర్ కేసు గుట్టురట్టుకానుందని తెలుస్తోంది. వివేకా మర్డ్రర్ కేసు వ్యవహారంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా బయటకు రావడంతో ఏం జరగబోతోందన్న ఆసక్తి సర్వత్రా ఏర్పడింది.