తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. మొయినాబాద్‌లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. దీనికి సంబంధించిన కేసుల విచారణను సీబీఐకి అప్పగిస్తూ.. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీసుకున్న నిర్ణయాన్ని ద్విసభ్య ధర్మాసనం కూడా సమర్థించింది. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఏం జరిగింది?
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో మొయినబాద్ వేదికగా.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఈ విషయంలో బీజేపీకి చెందిన కేంద్ర పెద్దలు ఉన్నారనే ఆరోపణలు, ఒక స్వామీజీ పాత్ర కూడా బయటపడ్డాయి. దీంతో ఈ కేసును సిట్‌కు అప్పగించింది కేసీఆర్ సర్కారు.
దీంతో రంగంలోకి దిగిన సిట్ కొందరిని విచారించింది కూడా. అయితే.. ఇంతలోనే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కొందరు నిందితులు కోర్టును ఆశ్రయించారు. వీరికి అనుకూలంగా సింగిల్ జడ్జి కేసును సీబీఐకి అప్పగిస్తూ.. తీర్పు చెప్పారు. అయితే.. దీనిని సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.
ఈ క్రమంలో తాజాగా హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణ కు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థిస్తూ.. ప్రభు త్వ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, ఈ ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు కొంత సమయం ఇవ్వాలని అడ్వ కేట్ జనరల్ కోరినప్పటికీ.. కోర్టు ససేమిరా అనడం గమనార్హం.