ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తనయురాలు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన వ్యవహారం దుమారం రేపుతోంది. డిసెంబరు 6వ తేదీన ఉదయం 11 గంటలకు కవిత విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో సీబీఐ అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు, విచారణకు కవితకు హైదరాబాద్ లో నివాసం లేదా ఢిల్లీలలో ఏది అనువుగా ఉంటుందో చెప్పాలని కోరింది.
ఈ క్రమంలోనే ఈ నోటీసులపై కవిత స్పందించారు. తనకు సీబీఐ నోటీసులు ఇచ్చిందని, విచారణకు సహకరిస్తానని ఆమె అన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో తనను ప్రశ్నించాలని సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చానని కవిత తెలిపారు. కవితకు సీబీఐ నోటీసులు జారీ కావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన ఏర్పడింది. ఈ నేపథ్యంలో కవిత నివాసం వద్దకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. దీంతో, అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు, సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో కవిత భేటీ కాబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడి, సిబిఐ కేసులపై కేసీఆర్ తో ఆమె చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కవిత పాత్ర ఉందని, ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్ లో జరిగిన పాలసీ రూపకల్పన సమావేశాల్లో కవిత పాల్గొన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక, సౌత్ సిండికేట్ కు కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రాతినిధ్యం వహించారని, దాదాపు వంద కోట్లు లంచం చెల్లించారని కూడా ఆరోపణలు వస్తున్నాయి.