వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే మూడు సార్లు సీబీఐ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు మరోసారి అవినాష్ రెడ్డిని విచారణ జరిపేందుకు సీబీఐ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే, ఈరోజు తాను విచారణకు హాజరు కాలేనని, ముందుగా ఫిక్సయిన షెడ్యూల్ వల్ల ఆ కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందని సీబీఐ అధికారులకు అవినాష్ రెడ్డి లేఖ రాశారు.
అంతేకాదు, విచారణకు హాజరయ్యేందుకు తనకు నాలుగు రోజుల గడువు కావాలని సీబీఐ అధికారులను అవినాష్ కోరారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలలో పాల్గొనేందుకు తాను పులివెందుల వెళుతున్నానని చెప్పారు. వాస్తవానికి మంగళవారం ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి రాసిన లేఖపై సీబీఐ అధికారులు స్పందించారు.
మే 19వ తేదీన హైదరాబాద్ లో అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాలంటూ మరోసారి నోటీసులు ఇచ్చారు. మరోవైపు, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ మెయిల్ పిటిషన్ పై అత్యవసర విచారణ కావాలంటే స్పెషల్ వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం….సీీబీఐకి సూచించింది. దీంతో, అవినాష్ రెడ్డి బెయిల్ వ్యవహారం పెండింగ్ లో ఉంది.