తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటున్న వైసీపీ నేతలు మూడు రాజధానులు తెచ్చి తీరుతామని చెబుతున్న సంగతి తెలిసిందే. అమరావతి రాజధాని అని చెప్పిన కోర్టు ఆదేశాలను కూడా తాము ధిక్కరిస్తామంటూ పరోక్షంగా మూడు రాజధానులపై ఇటువంటి ప్రకటనలు చేస్తున్న వైసీపీ నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో మూడు రాజధానులు నిర్మించడం సాధ్యం కాదని జగన్, వైసీపీ నేతలకు తెలుసని, అయినా సరే మూడేళ్లుగా మూడు రాజధానులు అంటూ వేసిన క్యాసెట్టే మళ్లీ వేసి వినిపిస్తున్నారని విపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
విశాఖలో వైసీపీ నేతలు భూదందాలు చేయడానికి రాజధాని కావాలంటున్నారంటూ దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం పట్టుబడుతున్న మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ తేల్చి చెప్పారు. అంతేకాదు, ఈ మూడు రాజధానుల వల్ల ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప వేరే ఉపయోగం ఏమీ లేదని స్పష్టం చేశారు. విశాఖలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఆంధ్రుడా మేలుకో’ కార్యక్రమానికి లక్ష్మీనారాయణ హాజరయ్యారు.
ఈ కార్యక్రమ నిర్వాహకుల డిమాండ్లతో తాను ఏకీభవిస్తున్నానని లక్ష్మీనారాయణ అన్నారు. మహారాష్ట్ర తరహాలో ప్రతి జిల్లాను రాజధాని చేస్తే ప్రాంతాల మధ్య విద్వేషాలకు తావు ఉండదని చెప్పుకొచ్చారు. తాను 22 సంవత్సరాలు మహారాష్ట్రలో పనిచేశానని, ఆ అనుభవంతోనే ఈ విషయం చెప్పానని అన్నారు. అక్కడ ప్రజలు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళరని తెలిపారు.
ప్రతి జిల్లాను ఒక రాజధానిగా అభివృద్ధి చేస్తే మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ప్రతి జిల్లా ఏదో ఒక రంగంలో ముందుకు వెళుతుందని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలని విశాఖలో రాజధాని పెట్టాలనుకుంటున్నారని, దీంతో రాయలసీమకు రాజధాని కావాలని అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఈ డిమాండ్ల వల్ల ప్రాంతాల మధ్య విద్వేషాలు తప్ప ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు.