సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేరు ఇరు తెలుగు రాష్ట్రాలలో కొద్ది సంవత్సరాల క్రితం మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ అక్రమాస్తుల కేసును సమర్థవంతంగా డీల్ చేసిన లక్ష్మీనారాయణ పేరు అప్పట్లో ప్రముఖంగా వినిపించేది. నిజాయితీపరుడిగా, ముక్కు సూటిగా వ్యవహరించే వ్యక్తిగా పేరున్న లక్ష్మీనారాయణ….జగన్ కేసును డీల్ చేసిన విధానం పలువురి ప్రశంసలను అందుకుంది.
ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా జగన్ అక్రమాస్తుల కేసును లక్ష్మీనారాయణ విచారణ జరిపారని మంచి పేరుంది. మామూలుగా సినిమాల్లో అయితే ఇంత నిజాయితీగా, నిర్భయంగా విచారణ జరిపే అధికారులకు చంపేస్తామని బెదిరింపులు రావడం సహజం. అక్రమాస్తులు కూడా పెట్టిన బడా బాబులకు వ్యతిరేకంగా పనిచేసే అధికారులను, వారి కుటుంబ సభ్యులను లేపేస్తామంటూ హెచ్చరికలు రావడం మామూలే.
అయితే, రీల్ లైఫ్ తరహాలోనే రియల్ లైఫ్ లోనూ లక్ష్మీనారాయణకు బెదిరింపులు వచ్చాయట. ఈ విషయాన్ని స్వయంగా లక్ష్మీనారాయణ వెల్లడించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. తన పదవికి…ఆ తర్వాత జనసేన పార్టీకి రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీల గురించి పెద్దగా స్పందించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ‘యూత్ ఫర్ యాంటీ కరప్షన్’ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన లక్ష్మీనారాయణ తాను సీబీఐ అధికారిగా ఉన్నప్పటి చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
తాను నిష్పక్షపాతంగా కేసులు విచారణ జరుగుతున్న సమయంలో తనను హత్య చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని ఆయన గుర్తు చేసుకున్నారు. తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని ఎరుపు రంగు ఇంకుతో వార్నింగ్ లెటర్లు వచ్చేవని ఆయన షాకింగ్ విషయాలు వెల్లడించారు. ప్రస్తుత సమాజంలో ప్రజాసేవ కన్నా వ్యక్తిగత స్వార్థం, అవినీతి పెరిగిపోయిందని అన్నారు.
రాజకీయ అవినీతిని రూపుమాపేందుకు యువత ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ఆన్లైన్ విధానం వల్ల ఆదాయపు పన్ను శాఖలో అవినీతి తగ్గిందని, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించి అవినీతిని తగ్గించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. గతంలో అవినీతిపరులు భయం భయంగా తిరిగే వారిని, కానీ, ఈనాడు సమాజంలో నిజాయితీపరులు భయంతో తిరుగుతున్నారని అభిప్రాయపడ్డారు. అయితే, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న ప్రాంతం నుంచి వచ్చిన జగన్ ను ఉద్దేశించే లక్ష్మీనారాయణ ఈ కామెంట్లు చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.