విశాఖ ఉక్కును ప్రైవేటీకరించి తీరతామని కేంద్రం బల్లగుద్ది మరీ చెబుతోన్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దంటూ ఏపీలో ఉవ్వెత్తున్న ఆందోళనలు,నిరసనలు ఎగసిపడుతున్నాయి. దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఈ ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నాయి. వైసీపీ కూడా మద్దతిస్తున్నప్పటికీ, కేంద్రంతో ఈ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో జగన్ సర్కార్ కు లాబీయింగ్ ఉందని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఇప్పటికే పలు రకాలుగా బంద్ , నిరసనలు తెలిపారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు సంబంధించి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో లక్ష్మీనారాయణ పిల్ దాఖలు చేశారు.
లక్ష్మీనారాయణ వేసిన పిల్ రేపు విచారణకు రానుంది. ఈ ఉద్యమానికి తన మద్దతును ప్రకటించిన లక్ష్మీనారాయణ…గతంలోనే కేంద్రానికి లేఖ రాశారు. స్టీల్ ప్లాంటును లాభాల బాటలోకి తెచ్చేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ లేఖ రాశారు. వివిధ పార్టీల నేతలు, మేధావులతో కూడా చర్చలు జరుపుతూ విశాఖ ఉక్కు ఉద్యమానికి తన వంతు సాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు విచారణకు రాబోయే పిల్ పై హైకోర్టు ఏం చెబుతుందోనన్న ఆసక్తి సర్వత్రా ఏర్పడింది.